ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

Mar 23 2026 9:11 AM | Updated on Mar 23 2026 9:11 AM

రాయగడ: ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. ఆదివారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా ఒక ప్రయాణికుడు ఎక్కే సమయంలో జారి పడ్డాడు. అదే సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అంకుర్‌ చౌదరి సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు కిందకు జారిపడుతున్న ప్రయాణికుడిని పట్టుకుని బయటకు తీసి ప్రాణాలను కాపాడాడు. నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అందరూ అతనిని అభినందించారు. గత ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన కూడా ఇదే తరహాలో అంకుర్‌ చౌదరి ఓ ప్రయాణికుడిని కాపాడి అందరి మన్ననలను పొందారు.

ఇళ్లలోకి దూసుకెళ్లిన ట్యాంకర్‌

రాయగడ: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఝార్సుగుడ వైపు అల్యూమిన కెమికల్స్‌ లోడుతో వస్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి మునిగుడలోని కన్యకాపరమేశ్వరి మందిరం సమీపంలోని ఇళ్లల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లకు చెందిన ప్రహరీలు, పెంకుటిళ్ల ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మునిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారు బయంతో బయటకు పరుగులు తీశారు. ఇళ్ల గోడలను ఢీకొన్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ట్యాంకర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

18 అడుగుల

కొండచిలువ పట్టివేత

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ 18 గ్రామంలో ఆదివారం ఓ ఇంటిలోకి కొండ చిలువ ప్రవేశించింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా పాములు పట్టే నిపుణులను తెచ్చి రెండు గంటల పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. ఇది 18 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు. దీన్ని సమీప అడవిలో విడిచిపెడతామని తెలిపారు.

జన గణన జన కల్యాణం

భువనేశ్వర్‌: పూరీ సాగర తీరంలో రూపుదిద్దుకున్న సైకత శిల్పం జన గణన జన కల్యాణం సందేశంతో సందర్శకులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల జన గణన బ్రాండ్‌ అంబాసిడరుగా నియమితులైన సుదర్శన్‌ పట్నాయక్‌ ఈ శిల్పం తీర్చిదిద్దారు. భారత తొలి డిజిటల్‌ జన గణన. ఈ కార్యక్రమం తొలి విడత కింద ఇండ్ల జాబితా మరియు లెక్కింపు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం మే నెల 15వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుందని ఈ శిల్పంలో ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement