రాభమద్రపురం/బొబ్బిలిరూరల్: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం డిమాండ్ చేశారు. రామభద్ర పురం మండంలోని ఎస్.సారాంపురం,గొల్లపేట,ఇట్లామామిడిపల్లి, బొబ్బిలి మండలంలోని కారాడ,పిరిడి,అలజంగి గ్రామాల్లో శనివారం పర్యటించారు.మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోం దని, తీరా సాగు చేశాక ఆయా పంటలను కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు.జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 60వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉందని, పంట దిగుబడి బాగుందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు క్వింటాల్ రూ.1,600 నుంచి రూ.1,700 విక్రయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దళారులు రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు.క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటకు మద్ధతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన విజయనగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు చేపట్టనున్న ధర్నాకు రైతులు తరలిరావాలని కోరారు. రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంనాయుడు,తదితరులు పాల్గొన్నారు.


