● ఒకరి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బాలిమెల పోలీసులు శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఆటోను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. పోలీసులను ఒకరు పరారవ్వగా బలిమెలకు చెంది దుర్యోధన్ మోరియాను అరెస్టు చేశారు. గంజాయిని ఛత్తీస్‌గఢ్ తరలిస్తున్నటుట నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెళ్లడించారు. చిత్రకొండ ఏరియాలో గంజాయని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ పట్టుబడ్డ నిందితుడిపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 150 కిలోలు ఉన్నట్టు తేలింది. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కార్గిల్ పార్కు పనుల పరిశీలన
శ్రీకాకుళం : జిల్లా పరిషత్ రోడ్డులోని సుడా కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సెషన్, స్పీచ్ పాయింట్ల వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫొటోలు తీయించి పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. పెండింగ్ పనులను టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కు ప్రారంభోత్సవం నాడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సుడా ఎస్‌ఈ సుగుణాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎం.ఈ. శర్మ, ఎంహెచ్‌ఓ సుధీర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎ.శైలజ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, డీఎస్‌డీఓ మహేష్, సుడా ఏఈలు పాల్గొన్నారు.
ఒకేసారి మూడు కొలువులు
హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. అటువంటిది ఒకేసారి మూడు బ్యాంకు కొలువులను సాధించాడు హిరమండలం మండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన కురమాన జగదీష్. ఇటీవల విడుదలైన స్టేట్‌బ్యాంక్ క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సత్యవతి సాధారణ వ్యవసాయ కూలీలు. జగదీష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఈ సందర్భంగా జగదీష్‌ను గ్రామస్తులు అభినందించారు.
ముగ్గురికి రిమాండ్
హిరమండలం: పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసిన ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. హిరమండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న రాత్రి 112 అత్యవసర విభాగానికి వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు కానిస్టేబుళ్లు ఇద్దరు హిరమండలం ప్రధాన రహదారికి వెళ్లారు. అయితే దంత తేజేశ్వరరావు, అల్లాడ మధుబాబు, నీలంశెట్టి మిన్నారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడిచేసే ప్రయత్నం చేశా రు. దీనిపై కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ముగ్గుర్ని అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు.


