క్లుప్తంగా
చైత్రం ఆగమనం నాడే మేఘాలు ఇలా పలకరించాయి. ఉగాది నాడు వాతావరణం చల్లగా మారిపోయింది. సందె వేళకు మబ్బులు ముసురుకున్నాయి. జి.సిగడాంలో కమ్ముకున్న మేఘ మాలికలు ఇలా కనువిందు చేశాయి. – జి.సిగడాం
వేడుకగా ఉగాది..
పర్లాకిమిడి: దక్షిణ భారత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది వేడుకలు స్థానిక ప్రవాసాంధ్రులు జంగం వీధి జంక్షన్ ఎస్.ఎ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు డాక్ట్ ఆర్.ఆర్.రవి అధ్యక్షత వహించారు. కన్వీనరు వెల్లంకి కూర్మనాథం, చెట్టి వేంకటేశ్వర్లు అతిథి పరిచయం చేశారు.వేదంభట్ల వేంకటరమణ మూర్తి, భాస్కరభట్ల రవి ఉగాది పంచాంగ పఠనం చేశారు. అనంతరం వారిని డాక్టర్ ఆర్.ఆర్.రవి సన్మానించారు. విశ్రాంత ఫిజిక్స్ రీడర్ ఎం.ఎన్.మూర్తి, రాయఘడ బీ.ఈ.ఓ టి.కిశోర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, మన సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. బ్రాహ్మణ సంఘం సభ్యులు పులఖండం రాంబాబ్జీ శర్మ, వేమూరి నరసింహ మూర్తి, సీతామహాలక్ష్మి, నాట్యశారద హిమగిరికి డాక్టర్ రవి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల అమంత భక్తి పాటలతో అలరించింది. అనంతరం హిమగిరి నేతృత్వంలో శిష్యబృందం నాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వెళ్లే మార్గ మధ్యంలో గురువారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని శ్రీకాకుళం రోడ్డు జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూదన రావు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
బంగారం కొనుగోలులో
గందరగోళం
కొత్తూరు: ఉగాది నాడు కొత్తూరులో బంగారం కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ఉగాది నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి సంప్రదాయం. ఉగా ది రోజు ఉదయం ఒక గ్రాము బంగారం ధర రూ.15,800 చూపించింది. సాయంత్రానికి రూ.14,900కు తగ్గింది. అయితే కొత్తూరులోని పలు షాపుల్లో తగ్గిన ధర కాకుండా ఉదయం ధరకే బంగారం విక్రయించారు. కొనుగోలుదారులు తర్వాత విషయం తెలుసుకుని నష్టపోయామని లబోదిబోమన్నారు. ఒకే ఊరిలో ఒక్కో షాపులో వేరు వేరు ధరలతో బంగారం విక్రయాలు జరగడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
గేట్‌లో ఆల్ ఇండియా 248వ ర్యాంక్
పొందూరు: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస రాజ్‌కుమార్ గేట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గేట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ 248 పొందాడు. ప్రస్తుతం రాజ్‌కుమార్ ఐఐటీ ధన్‌బాద్‌లో కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ తండ్రి మొదలవలస గోవిందరావు మెడికల్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మొదలవలస జయసుధ గృహిణి.
గేట్‌లో 544వ ర్యాంకు
సంతబొమ్మాళి: బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్‌కుమార్ గేట్ ఎంట్రన్స్‌టెస్ట్‌లో ఆల్ ఇండియాలో 544వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక విద్య బోరుభద్రలోని ప్రైవేటు పాఠశాలల్లో, వెన్నెలవలస నవోదయలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫిబ్రవరి 8న జరిగిన గేట్ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు రమేష్‌బాబు, కళావతమ్మ గ్రామస్తులు అభినందించారు.
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లఖినేని కిరణ్‌కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా ఎంపికై గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అవార్డును అందుకున్నారు. పశువుల పునరుత్పత్తి విభాగంలో 2012 – 2026 వరకు కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తి చేయడంలో కిరణ్‌కుమార్ చేసిన సేవలకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు టెక్కలి డివిజన్ పరిధిలో గల పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.


