రాయగడ: స్థానిక కళింగ వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కింతలి అమర్‌నాథ్ మంగళవారం తెలిపారు. సంఘం కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 19న ఉదయం పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నటి, కళాకారిణి, ఒడియా సినీనేపథ్య గాయని డాక్టర్ అనురాధ పాణిగ్రహి పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నీటి పైపు పగిలినా
పట్టించుకోరా?
రాయగడ: స్థానిక ప్రధాన రహదారి (మెయిన్ రోడ్డు) వద్ద మంచినీటిని సరఫరా చేసే పైపు పగిలిపోయి గుంతగా మారింది. రెండు నెలలుగా పైపు పగిలిపోయినప్పటికీ పట్టించునే నాథుడే కరువయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పైపులైన్ పగిలిపోయి నీరు లీకవుతుండడంతో రోడ్డంతా బురదమయంగా మారుతుంది. అలాగే గుంత కూడా రోజురోజుకూ పెద్దది అవుతుండడంతో వాహన చోదకులు ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికై నా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి!
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ ప్రధాన బజారు వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ ప్రధాన్ (28) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈయన పద్మపూర్‌లోని బిజయానంద ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తుండేవారు. ఈ నెల 16వ తేదీన విధులకు హాజరు కాలేదు. దీంతో తోటి ఉపాధ్యాయులు అదే రోజు సాయంత్రం అతని ఇంటికి వెళ్లి తలుపుతట్టి చూశారు. దీంతో ఇరుగురు పొరుగువారిని పిలిచి తలుపులను కష్టంగా పగలగొట్టి చూడగా రంజిత్ కుమార్ ప్రధాన్ అచేతన స్థితిలో పడి ఉన్నారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు.
ఇంటిపై ఏనుగు దాడి
భువనేశ్వర్: పూరింటిపై ఏనుగు దాడి చేసింది. దీంతో గోడ కూలిపడడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జలేశ్వర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కెందు ఖుంటా గ్రామంలో ఏనుగుల దాడితో ఇంటి గోడ కూలడంతో బాలుడు మృతి చెందాడు. రైబొణియా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


