● యువకుడి హల్‌చల్
రాయగడ:
ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. చెట్టు ఎక్కి తాడు సహాయంతో ఉరి వేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిన యువకుడిని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని బుజ్జగించి చెట్టు పైనుంచి కిందకు దింపి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం ఎందుకు చనిపోవాలో గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని రామనగుడ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని తోటలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చెట్టు ఎక్కిన యువకుడుని బిసంకటక్ పంచాయతీలోని దండాపాడ గ్రామానికి చెందిన రమేష్ కొలకగా గుర్తించారు. రమేష్ కొన్నాళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని అందుకు తన ప్రేమను అంగీకరించమని యువతిని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై రామనగుడకు వెళ్లి అక్కడ ఓ తోటలో ఉన్న చెట్టును ఎక్కి చనిపోవడానికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


