న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
కటక్ ఎస్‌సీబీ ట్రామా కేర్ ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించడంతో
ఆవరణలో బెంబేలెత్తిన జనం
కటక్ ఎస్‌సీబీ ట్రామా కేర్ ఐసీయూ
వార్డులో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన సరంజామా
భువనేశ్వర్:
కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ట్రామా కేర్ యూనిట్ మరుభూమిలా మారింది. ఇక్కడి ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రామా కేర్ మొదటి అంతస్తు వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. మొత్తం 23 మంది రోగులు ఐసీయూ లోపల చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదం తర్వాత ఐసీయూలో పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు అటూఇటూ పరుగులు తీశారు.
ఐసీయూ నుంచి రోగుల తరలింపు సమయంలో ఏడుగురు మరణించారు. తరలింపు తర్వాత మరో ముగ్గురు రోగులు మరణించారని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఒక రోగిని ఐసీయూ నుంచి ప్రాణాపాయ స్థితిలో రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అగ్ని మాపక దళం తక్షణమే రంగంలోకి దిగి మంటలను నివారించింది. ఈ ప్రమాదంలో 11 మంది ఆస్పత్రి సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షి కథనం
కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్ధరాత్రి 2.40 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొదట ఓల్టేజి హెచ్చుతగ్గులతో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు ఆగిపోయాయి. కాసేపటి తర్వాత మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
10 మంది మృతులు
ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో రమేష్ పరిడా, దశృ ముండా, మహ్మద్ నూమ్, గౌరంగ్ బారిక్, షేక్ అబ్దుల్ సత్తార్, మధుసూదన్ దొలై, కృష్ణచంద్ర బిస్వాల్, రవీంద్ర దాస్, చెరు పరిడా, మేనకా రౌత్ ఉన్నట్లుఽ ధ్రువీకరించారు.
భారత రాష్ట్రపతి సానభూతి
కటక్ ఎస్‌సీబీ ఆస్పత్రిలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
గవర్నర్ దిగ్భ్రాంతి
కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ట్రామా కేర్ ఐసీయూలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి సంతాపం
ఒడిశాలోని కటక్‌లోని ఒక ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం తీవ్ర బాధాకరమని, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సంతాప సందేశం జారీ చేశారు.
మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సాయం అందజేయడం జరుగుతుందన్నారు.
ప్రతిపక్ష నేత సంతాపం
ఎస్‌సీబీ అగ్ని ప్రమాదంపై ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. సత్వర సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, కటక్ నగర మేయరుకు ఆయన సూచించారు.
ఉగాది ఉత్సవాలకు రాయగడ ముస్తాబు
ముఖ్యమంత్రి సమీక్ష
ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పోలీసు కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి ఉన్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి స్పందిస్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 23 మంది రోగులు ట్రామా కేర్ ఐసీయూలో ఉన్నారు. వారందరినీ తరలిస్తుండగా 10 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల వంతున సానుభూతి సాయం ప్రకటించారు. ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.


