రాయగడ: జిల్లాలోని టికిరి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది. అటవీ రేంజ్ పరిధిలోని శంకరడ, డులుకాబహాల్ తదితర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా మేకలు, కోళ్లను తినేస్తున్నట్లు ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అటవీ శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి పులి ఆచూకీని పరిశీలిస్తున్నారు. డులుకాబహాల్ అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలను గుర్తించిన సిబ్బంది ఈ మేరకు పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయంలో బయటకు రాకూడదని హెచ్చరించారు. టికిరి అటవీ శాఖ రేంజర్ అనిల్ కుమార్ పాణిగ్రహి నేతృత్వంలో ఒక బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
480 లీటర్ల నాటుసారా స్వాధీనం
రాయగడ: అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధల్‌సామంత నేతృత్వంలో జిల్లాలోని గుడారిలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో 480 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతో పాటు సారా తయారీకి వినియోగించే 3,200 కిలోల విప్పపువ్వును స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడారి సమీపంలోని సునారపల్లి ప్రాంతంలో నాటుసారా తయారీ, రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు అబ్కారీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా, విప్పపువ్వుతో పాటు 74 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. అయితే అబ్కారీ శాఖ దాడులను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సారా తయారీ ముఠా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
22 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 90 గ్రామం వద్ద ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కలిమెల పోలీసులు ఓ బైక్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో 22 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి ఐఐసి ప్రభుదత్త విశ్వాల్ సోమవారం విచారించారు. ఈ ఇద్దరు ఆంధ్రా అన్నమయ్య జిల్లాకు చెందిన కె.శివ ప్రసాద్, ఎ.లక్ష్మీపతి అని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి వారి బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇసుకతో ట్రాలీఆటో బోల్తా
పర్లాకిమిడి: స్థానిక పురపాలక సంఘం కార్యాలయానికి ఆనుకొని ఉన్న 13వ వార్డు భవానీ టాకీస్ వీధి ఎంట్రన్స్‌లో సోమవారం ఇసుకను తీసుకొని వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, హెల్పర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భవానీ టాకీస్ వీధి ప్రవేశంలో పురపాలక సంఘం వేసిన కాలవ మరీ ఎత్తు పెంచడంతో ఇక్కడ తరచూ వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీన్ని సరిచేయించేలా చూడాలని 13వ వార్డు కౌన్సిలర్‌కు స్థానికులు అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై న పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి దృష్టిసారించి వీధి వద్ద పెంచిన ఎత్తును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


