భువనేశ్వర్: సోమవారం రాజ్య సభ ఎన్నికల తంతు సకాలంలో కొనసాగింది. ప్రధానంగా ఈ ఎన్నికలో సిగపట్లు పడుతున్న అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీలు తమ ఎమ్మెల్యే ఓటర్లకు రాజధాని నగరం వెలుపల విడిది ఏర్పాటు చేసింది. పారాదీప్‌లో అధికార బీజేపీ ఓటర్లు, బెంగళూరులో కాంగ్రెసు ఓటర్లు గత 3 రోజులుగా తీరిగ్గా గడిపారు. ఆయా పార్టీల రాష్ట్ర ప్రముఖులు ఓటర్ల విడిది వ్యవహారం పర్యవేక్షించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, కాంగ్రెసు ఎంపీ సప్తగిరి ఉల్క ఆధ్వర్యంలో వారికి చెందిన ఓటర్లని సకాలంలో రాజధాని నగరానికి తరలించారు. ఇదిలా ఉండగా గుండె సంబంధిత అనారోగ్యం చికిత్స కోసం న్యూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ రాజ్యసభ పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నగరానికి చేరారు. ఆయన చేరడంతో ముఖ్యమంత్రి తన వంతు బాధ్యతగా పరామర్శ ముసుగులో రాజ్యసభ వ్యవహారాలపై అవగాహన కల్పించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ సముదాయంలో 54వ నంబరు గదిలో సోమవారం ఉదయం 9 గంటలకు రాజ్య సభ ఎన్నిక పోలింగ్ ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ తెలిపారు.


