జయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఆదివారం జయపురం సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొదలైన పోటీలతో ఉగాది సందడి ప్రారంభమైంది. నేడు మహిళలకు ముగ్గుల పోటీలు, నృత్య పోటీల్లో మహిళలు, కళాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో పాఠశాల ఆవరణం కళకళలాడడంతో నాలుగు దినాల ముందుగానే ఉగాది పండగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయిక్ మాట్లాడుతూ నేడు జరిగిన నృత్య పోటీల్లో పట్టణంలోగల వివిధ డ్యాన్స్ అకాడమీలకు చెందిన కళాకారులు తెలుగు పాటల ఆధారంగా సోలో, డ్యూయెట్, గ్రూపు డ్యాన్స్ విభాగాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇక్కడ ఎంపికై న టీమ్‌లు ఈ నెల 19 వ తేదీ ఉగాది పండగ దినాన జరిగే కార్యక్రమంలో పాల్గొంటాయని వెల్లడించారు. మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 15 మంది పాల్గొన్నారని విజేతలుగా నిలిచన కె.వసుంధర, తులసి నాయిక్, పి.ఉమలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వంటల పోటీలు కూడా నిర్వహించామన్నారు.


