వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు సందర్శన | - | Sakshi
Sakshi News home page

వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు సందర్శన

Mar 16 2026 7:23 AM | Updated on Mar 16 2026 7:23 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి పలిగుడ వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు ద్వారా సాగునీరు పొందుతూ పంటలు పండిస్తున్న అటలగుడ గ్రామాన్ని కొరాపుట్‌ వాటర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శివ చరణ జెట్టి ఆదివారం సందర్శించారు. అటలగుడ గ్రామంలో రివార్డ్‌ కార్యక్రమంలో ఎల్‌ఆర్‌ఐ మట్టి పరీక్షలు జరిపి వైజ్ఞానిక పద్ధతిలో 20 ఎకరాల్లో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించిన డైరెక్టర్‌ పంట అధికోత్పత్తి ఇచ్చేందుకు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన అటలగుడ గ్రామంలో ఆ గ్రామ రైతులతో సమావేశమై ప్రాజెక్టు ద్వారా రైతులకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐ అండ్‌సీబీ అనంత కిశోర్‌ సాహు, బొయిపరిగుడ సెక్టర్‌–1 పిఐఎ నరశింగ నాయిక్‌, అనిరుద్ద దలసామంత, సమర మహంకుడ, అజిత్‌ స్వైయ్‌, తుషార కాంత నాయిక్‌, అనిరుద్ధ దలసామంత, ఎస్‌జీ ఫౌండేషన్‌ కార్యకర్త జగత్‌ దొర, నజియ సుల్తాన, బసంత లెంక, బిశ్వజిత్‌ మిశ్ర, అనిత పాత్రో, లావస్‌ ఎన్‌జిఓ టీమ్‌ లీడర్‌ లోకనాధ్‌ మహంతి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

దుకాణం లోపల తండ్రీకొడుకులు సజీవ దహనం

భువనేశ్వర్‌: ఖుర్దా జిల్లా బెగుణియా సన్నొపొదొరొ ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక దుకాణం లోపల తండ్రీకొడుకులు సజీవంగా దహనమయ్యారు. తండ్రి రాజేష్‌ కుమార్‌ సాహు, కుమారుడు లక్ష్మీధర్‌ సాహు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి పూట దుకాణంలో నిద్రిస్తున్నప్పుడు వారు సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగిన తర్వాత వారు దుకాణం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఈ విషాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దుకాణం దగ్ధం అయ్యేందుకు ప్రేరేపించిన కోణంలో దర్యాప్తు చేపట్టారు. తండ్రీ కొడుకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో అకాల వర్ష సూచన

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఈ నెల 22 వరకు వివిధ ప్రాంతాల్లో కాల వైశాఖి వాతావరణం (గాలివాన) ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట కాల వైశాఖి వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం సమాచారం. 9 జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. ఈ 9 జిల్లాల్లో బాలాసోర్‌, భద్రక్‌, మయూర్‌భంజ్‌, కెంజొహర్‌, గంజాం, గజపతి, రాయగడ, కంధమల్‌ మరియు కలహండి జిల్లాలు ఉన్నాయి.

కంటైనర్‌లో 81 పశువుల పట్టివేత

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి చాంపఖారి కూడలి వద్ద ఆదివారం ఉదయం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న మల్కన్‌గిరి పోలీసులు ఓ కంటైనర్‌ లో అక్రమంగా తరలిస్తున్న 81 ఆవులను రక్షించారు. అక్రమ పశువుల రవాణా ఆరోపణలపై వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో ఐఐసీ రీగడ్‌ కీండో ఆదేశాలతో ఓ బృందం చాంపాఖారి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుండే మాటు వేసి కంటైనర్‌ను నిలిపివేశారు. అందులో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement