జయపురం: మూడు నెలల కిందట జరిగిన దొంగతనం కేసులో జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.2.50 లక్షలు స్వాధీన పరచుకున్నారు. నగదుతో పాటు ఒక మోటారు బైక్, ఇనుప రాడ్డు స్వాధీన పరచుకున్నట్లు బొరిగుమ్మ పోలీసు ఎస్‌ఐ దోణాచార్య బాగ్ శనివారం పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులు కొరాపుట్ పట్టణంలో స్టేడియం కాలనీ వాసి చందన బెహర (23), జయపురం పట్టణం ఒడియ మేదరి వీధికి చెందిన అజయ్ అలియాస్ రింకు నాయిక్(30), మూడో వ్యక్తి జయపురం చందనబెడ బంగారు వర్తకుడు ఎం.శిశ(45) అని వెల్లడించారు.
పోలీసు అధికారి వివరణ ప్రకారం 2025 డిసెంబర్ 20 వ తేదీన బొరిగుమ్మ పట్టణం నవరంగపూర్ రోడ్డులో ఉంటున్న బినాయక పాడి కుటుంబం, తమ పర్సనల్ కారణాల వల్ల బయటకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని తెలుసుకున్న దుండగులు ఆ ఇంటిలోకి వెళ్లి ఒక బంగారు నెక్లెస్, బంగారు కాన్‌పూసలు మొదలగు 95 గ్రాముల బంగారు వస్తువులు, రెండు లక్షల నగదు దోచుకు పోయారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయినా కేసు పరిష్కారం కాకపోవడంతో బినాయక పాడి కుమార్తె అంజలీ పాఢి, ఆమె కుటుంబీకులు బొరిగుమ్మలో కలెక్టర్ నిర్వహించిన అభియోగ సునానీలో ఈ విషయం పై ఫిర్యాదు చేశారు. తర్వాత కొరాపుట్ ఎస్.పి, జయపురం, బొరిగుమ్మ పోలీసులతో ఒక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు టీమ్ తమ దర్యాప్తులో నిందితులను గుర్తించారు. వారిని అదుపు లోనికి తీసుకొని విచారించగా వాస్తవాలు బయట పడ్డాయి. దొంగిలించిన సామగ్రిని జయపురంలో ఒక బంగారు వ్యాపారికి ఇచ్చారు. బంగారు వ్యాపారి వారికి రూ.50 వేలు ఇచ్చాడు. కేసు చిక్కుముడి విప్పిన పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు బంగారం కొన్న బంగారు వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.


