కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో నిత్యం వేలాది ప్రజలు గ్యాస్ బుకింగ్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజన్సీలు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్యాస్ బుకింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ గ్యాస్ భయాందోళనలు కొనసాగుతున్నాయి.
మూత పడ్డ చిన్న చిన్న హోటల్స్
ఇంత వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమం గా వినియోగించుకున్న వారు నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో గ్యాస్ లేక హోటల్స్ మూత పడ్డాయి. ఇరు జిల్లాల్లో వందలాది చిన్న తరహా హోటల్స్ మూత పడ్డాయి. కొనడానికి కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడం, బ్లాక్ లో డొమెస్టిక్ గ్యాస్ లభించకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో వేలాది హోటల్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. శనివారం కొరాపుట్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పని చేసినప్పటికీ ఫలితం లేక పోయింది.
కాంగ్రెస్ నిరసనలు
కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సమస్య పై తన నిరసనలు కొనసాగిస్తోంది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఖాళీ సిలెండర్లతో కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫీక మజ్జి, మున్నా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ ఆందోళన చేసింది. రోడ్డు మీద కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి ప్రజల దృష్టి ఆకర్షించింది.
కఠిన చర్యలు తీసుకుంటాం: కొరాపుట్ కలెక్టర్
గ్యాస్ అక్రమం నిల్వలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ హెచ్చరించారు. శనివారం కలక్టరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గ్యాస్ అక్రమ నిల్వల పై ఉక్కు పాదం మెపుతామన్నారు. ఇప్పటికే ప్రత్యేక స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన గ్యాస్,పెట్రోల్ నిల్వలు జిల్లాలో ఉన్నాయన్నారు.


