భువనేశ్వర్: హైటెక్ డెంటల్ (దంత) కళాశాల మరియు ఆస్పత్రిలో అత్యాధునిక సీబీసీటీ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల దంత వైద్య నిపుణులు, అధ్యాపకులను సంస్థ అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంక్లిష్ట దంత సంబంధిత రోగ నిర్ధారణ, కచ్చితమైన చికిత్స రంగంలో ఈ వ్యవస్థ విప్లవాత్మక మార్పు ఆవిష్కరిస్తుందని హై టెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ఈ అత్యాధునిక యంత్రం అతి తక్కువ రేడియేషన్‌తో సంక్లిష్ట వ్యాధులను నిర్ధారించే సామర్థ్యం కలిగి ఉంది. పేద, మధ్య తరగతి రోగులు చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాన్ని పొందవచ్చని డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. డెంటల్ కాలేజీ, హాస్పిటల్ తాత్కాలిక చైర్మన్ మధుస్మిత త్రిపాఠి మాట్లాడుతూ రోగులు, విద్యార్థులు ఇలాంటి అధునాతన దంత నిర్ధారణ యంత్రాల నుంచి మరింత ప్రయోజనం పొందుతారన్నారు. ఓరల్ మెడిసిన్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ దేబాజ్యోతి వర్ధన్ మాట్లాడుతూ, ఈ అత్యాధునిక సీబీసీటీ యంత్రం అతి తక్కువ సమయంలో వ్యాధులను కచ్చితంగా నిర్ధారిస్తుందన్నారు. చికిత్సా పద్ధతిని అంచనా వేయడం సులభతరం అవుతుంది. హైటెక్ డెంటల్ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్ పాత్రో కృషితో ఈ యంత్రం ఏర్పాటు జరిగింది. సంక్లిష్టమైన ఆర్థోడాంటిక్, ఎండోడాంటిక్ వ్యాధులను నిర్ధారించడంలో సీబీసీటీ యంత్రం చాలా సహాయకారిగా ఉంటుందని వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సుబాష్ చంద్ర నాయక్ అన్నారు. డెంటల్ ఇంప్లాంట్లు, మాక్సిల్లోఫేషియల్ ట్రామాను నిర్ధారించడంలో ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని ప్రొఫెసర్ డాక్టర్ అభిలాష్ దేవి అన్నారు.


