● కొరాపుట్ జిల్లాలో 8,912 కేసులు పరిష్కారం
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు శనివారం కొరాపుట్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ న్యాయ సేవా ప్రదీకరణ, రాష్ట్ర న్యాయ సేవా ప్రదీకరణల ఆదేశాల మేరకు నిర్వహించిన అదాలత్‌లో 8,912 కేసులు పరిష్కరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జయపురం, కొరాపుట్, కొట్‌పాడ్, బొరిగుమ్మ, సెమిలిగు, దసమంతపూర్ లమతాపుట్, లక్ష్మీపూర్‌లోని అన్ని న్యాయస్థానాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అదాలత్ జరిగింది. 8,912 కేసులు పరిష్కరించగా.. 3 కోట్ల 54 లక్షల 95 వేల 124 రూపాయలను జరిమానా రూపంలో వసూలు చేశారు. జిల్లా జడ్జితో పాటు ఫ్యామిలీ కోర్టు జడ్జి నిశిత్ మహంకుడో, ప్రధాన విచార విభాగ జడ్జి ఎస్.విజయలక్ష్మీ, సీనియర్ సివిల్ జడ్జి స్వయం ప్రకాశ దాస్, మహిళా కోర్టు జడ్జి అలకానందన్ మహంతి, సివిల్ కోర్టు రిజస్టార్ విష్ణుప్రసాద్ దేవత, సబ్‌డివిజన్‌ల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్‌కుమార్ బారిక్, ప్రథమ శ్రేణి జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.


