బ్రహ్మోత్సవాలకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు వేళాయె..!

Feb 22 2026 7:01 AM | Updated on Feb 22 2026 7:01 AM

బ్రహ్

బ్రహ్మోత్సవాలకు వేళాయె..!

రాయగడ: పారిశ్రామికవాడ జేకేపూర్‌లోని భూసమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి మందిరం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సోమవారం నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందుకు స్వామి వారి మందిరంతో పాటు ప్రాంగణంలో ఉన్న ఉప మందిరాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభమయయ్యే బ్రహ్మోత్సవాలు 28వ తేది వరకు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పొందూరు వెంకట ప్రదీప్‌, అంపోలు రంగనాథ ఆచార్యులు శనివారం తెలియజేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల గురించి వివరిస్తూ ఉదయం 8.30 గంటలకు 108 కలశాలతో యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. సమీపంలోని నాగావళి నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి మందిరంలో నిలుపుతారు. సాయంత్రం ఐదు గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహావాచనం, తిరువీఽధి, రక్షాసూత్రబంధం, రుత్విక్‌ వరుణ, ముత్సంగ్రహణం, అంకురారోహణ, అగ్ని ప్రతిష్టలతో పాటు నాగావళి నది నుంచి 108 కలశాలతో తీసుకువచ్చిన శుద్ధ జలాల ఆవాహనం, నీరాజన మంద్రపుష్పం, మంగళాశాసనం పూజలు ఉంటాయి. ఉత్సవాలు ముగిసేవరకూ రోజూ ప్రత్యేక పూజలు ఉంటాయని అర్చకులు పేర్కొన్నారు. చివరి రోజున ఉదయం సుప్రభాత సేవ, వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, సాయంత్రం 4.30 గంటలకు శేషవాహన సేవ, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, పవళింపు సేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

అంచెలంచెలుగా అభివృద్ధి

పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్‌లో ఆధ్యాత్మికంగా ఏదైనా మందిరం నిర్మించాలని ప్రాంత వాసులు సంకల్పించారు. ఈ క్రమంలో అప్పటి మాజీ సర్పంచ్‌, సంఘ సేవకులు రెడ్డి సంఘం నాయుడు మందిరం నిర్మాణానికి తనసొంత స్థలాన్ని విరాళంగా అందించారు. 1972వ సంవత్సరంలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అందిరి సహాయ, సహకారాలతో 1976లో మందిరం ప్రతిష్టోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. అప్పట్లో స్వామి వారి మందిరాన్ని జేకేపేపర్‌ మిల్లులో విధులు నిర్వహిస్తుండే గుమ్మడి లింగయ్య పరిశీలిస్తుండేవారు. అనంతరం ఆంధ్రకళాసమితి ఆధ్వర్యంలో మరికొంత కాలం మందిర నిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతుండేవి. కాలక్రమంలో మందిరం అభివృద్ధి జరుగుతుండటంతో పాటు దాతలు తమకు తోచిన విరాళాలు అందిస్తుండటంతో అంచెలంచెలుగా..సుందరంగా అభివృద్ధి చెందింది.

మందిరంలో ఉపాలయాలు

మందిరం ప్రాంగణంలో స్వాగత ద్వారానికి దగ్గరలో సమారు 32 అడుగుల శ్రీహనుమాన్‌ విగ్రహం కనిపిస్తుంటుంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ విగ్రహం జేకేపూర్‌కు వెళ్లి వచ్చే వారికి దర్శనమిస్తుంది. అలాగే మందిర ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, శ్రీరామ, గోదాదేవి, అభయాంజనేయ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. మందిరం వెనుక భాగంలోని స్థలంలో గోవిందుని ఆరాధ్యులు అన్నమయ్య, శ్రీరామదాసు విగ్రహాలతో పాటు సరస్వతీ దేవి విగ్రహలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మందిరం ఎడమ భాగంలో వారాహి లక్ష్మీ, కాళీమర్దనం విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

మందిరం ప్రాంగణంలోని రామాలయం

రామ స్థూపం

ఈ ప్రాంతలో ఎంతో మంది భక్తులు స్వామి వారిని కొలిచే రామకోటిని రచించారు. రామకోటి రచనలకు సంబంధించి పవిత్ర పుస్తకాలను ఒకేచోట ఉంచి ఆ స్థానంలో రామ స్థూపాన్ని నిర్మించారు. ఆకర్షణీయంగా కనిపించే రామస్థూపం ఈ ప్రాంత ప్రజల భక్తిని చాటే విధంగా నిర్మించడం విశేషం. నిత్యం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ స్థూపాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు.

బ్రహ్మోత్సవాలకు వేళాయె..!1
1/1

బ్రహ్మోత్సవాలకు వేళాయె..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement