తరిమికొడదాం
మూఢ నమ్మకాలను
● సామాజిక సంరక్షణశాఖ
అధికారి మీనతీదేవ్
రాయగడ: మూఢ నమ్మకాలతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయని.. వీటికి తిలోదకాలు పలికితేనే సామాజికంగా, మానసికంగా మనిషి అభివృద్ధి చెందడంతోపాటు సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటాడని జిల్లా సామాజిక సంరక్షణశాఖ అధికారి మీనతీదేవ్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్‌లో శుక్రవారం ‘మూఢనమ్మకాలు–చైతన్య కార్యక్రమాలు’అనే అంశంపై ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలొ ఆమె ప్రసంగించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఏదైన జ్వరం, అనారోగ్యానికి గురైతే వారు వైద్యులను సంప్రదించకుండా మంత్రగత్తెల వద్దకు తీసుకువెళ్లి పూజలను చేసి కాలయాపన చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. అటువంటి వాటికి గురై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు ఇంకా అనాగరితకు అద్దం పడుతుండటం విచారకరమని అన్నారు. ఈ నేపథ్యంలో మూఢ నమ్మకాలను తొలగించే విధంగా చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ఇందుకు తమవంతు సహకారం అందివ్వాలని అన్నారు. ఇటువంటి అనాగరికత చర్యలకు ప్రజలు గురికాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మూఢనమ్మకాలతో మహిళలు పలు విధాలుగా అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు.
నిరక్షరాస్యతే మూల కారణం
గ్రామాల్లో మూఢనమ్మకాలతో ప్రజలు ఇప్పటికీ ఉన్నారంటే అందుకు వారి అవిద్యే కారణమని కార్యక్రమంలొ పాల్గొన్న ఏఎస్పీ గొసనరా బరల్ అన్నారు. వారిలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను పారద్రోలాలంటే వారిని చైతన్య పరచాలని అన్నారు. ఆధునిక యుగంలో అడుగుపెట్టిన మనం ఇంకా ఇటువంటి వాటిని నమ్మడం విడ్డూరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి నెపంతో ఎంతోమంది దారుణ హత్యకు గురవుతున్న సంఘటనలు వెలుగు చూస్తుండటం మూఢనమ్మకాలకు ఆజ్యం పోషినట్లుగానే ఉంటుందని అన్నారు. మూఢనమ్మకాలను కూకటివేళ్లతో పెకిలించాలంటే అందుకు చైతన్య కార్యక్రమాలు విరివిగా నిర్వహించడమే మార్గమని అన్నారు. కార్యక్రమంలొ అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూఢనమ్మకాలతో సంభవించే అనర్థాలకు సంబంధించి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
తరిమికొడదాం


