సాగునీరు ఉపయోగించుకుంటే అధిక పంటలు
పర్లాకిమిడి: సాగునీటి సంఘాల ద్వారా సాగునీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అధిక పంటలు పండించవచ్చని చిన్ననీటి పారుదల శాఖ ఎస్‌ఈ సింహాచల శతపతి అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఆర్.శెఠి భవనంలో డివిజన్ స్థాయి సాగునీటి సంఘాల పక్షోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 146 సాగునీటి సంఘాలు ఉన్నాయన్నారు. సాగునీటి సంఘాల నిర్వాహణకు ఎంత ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారో ప్రాజెక్టు వద్ద సైన్ బోర్డులు పెట్టడం లేదని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు అన్నారు. ప్రతీ పథకం వినియోగానికి పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అదనపు చీఫ్ ఇంజినీర్ రాంప్రసాద్‌రావు మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో వ్యవసాయంపై 75 శాతం రైతులు ఆధారపడి ఉన్నారని, సాగునీటి సంఘాల ద్వారా దిగువ భూములకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. సాగునీటి సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సూచించారు. అనంతరం సాగునీటి సంఘాల ద్వారా నీటి పంపకాలు సక్రమంగా జరుపుకుంటామని రైతులచే అధికారులు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డివిజన్ ఎస్‌ఈ సరోజ్ కుమార్ నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, ఏఈఈ అశిష్ కుమార్ మల్లిక్, అసిస్టెంట్ ఇంజినీర్ మనోజ్ కుమార చౌదరి, ఏఈ సుకుమార్ శతపతి, సుజాతా కుమారి గౌడో తదితరులు పాల్గొన్నారు.
సాగునీరు ఉపయోగించుకుంటే అధిక పంటలు


