రాష్ట్రాభివృద్ధి
పోటీతత్వంతోనే..
భువనేశ్వర్: పోటీతత్వంతోనే ఒడిశా రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి అన్నారు. స్థానిక వరల్డ్ స్కిల్స్ సెంటర్‌లో ఒడిశా స్కిల్స్ 2025–26ను బుధవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరివర్తనలో కీలక భాగమన్నారు. ఒడిశా స్కిల్స్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదని, యువ పోటీదారులలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సజనాత్మకత, శ్రేష్ఠత సాధనను ప్రేరేపించే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శ్రేణి నైపుణ్యత కలిగిన యువతను ఆవిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. పోటీతత్వం ఉన్న యువత ద్వారా అభివృద్ధి చెందిన ఒడిశా నిర్మాణం సాధ్యమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
49 విభాగాల్లో..
ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా యువత పాల్గొంటున్నారు. వీరంతా పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆధారంగా 49 నైపుణ్య విభాగాలలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీ విజేతలు జాతీయ స్థాయిలో ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తారు. తర్వాత ప్రపంచ నైపుణ్య పోటీలో పాల్గొంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ నైపుణ్య పోటీని స్కిల్ ఒలింపిక్స్‌గా వ్యవహరిస్తారు.
ఈ ఏడాది రాష్ట్రంలోని 10 ప్రధాన ప్రదేశాలలో ఈ పోటీ జరుగుతోంది. ప్రతి నైపుణ్య విభాగంలో ఒడిశా స్కిల్స్ 2025–26 విజేతకు ముఖ్యమంత్రి ఆస్పైర్ పథకం కింద ముఖ్యమంత్రి నైపుణ్య అవార్డును ప్రదానం చేస్తారు. ఇది అత్యుత్తమ ప్రతిభను గుర్తించి యువత ఉన్నత స్థాయి నైపుణ్యాల సాధనకు ప్రోత్సహిస్తుంది. ఒడిశా స్కిల్స్ పోటీని ఒక గమ్యస్థానంగా కాకుండా ఎదుగుదలకు తొలి మెట్టుగా పరిగణించి ఉత్సాహంతో ముందుకు సాగాలని మంత్రి సంపద చంద్ర స్వంయి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పోటీలో పాల్గొనేవారు ఉత్తమ పద్ధతులను గుర్తించడానికి, పారిశ్రామిక ప్రామాణికలతో పరిచయం పొందడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, కార్యదర్శి భూపేంద్ర సింగ్ పుణియా ప్రోత్సహించారు. వరల్డ్ స్కిల్స్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రిన్సిపల్, డిప్యూటీ ప్రిన్సిపల్, పరిశ్రమల భాగస్వాములు, నిపుణులు, జ్యూరీ సభ్యులు, శాఖ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా హాజరయ్యారు.
రాష్ట్రాభివృద్ధి


