ఉత్సాహంగా పుష్‌పుణి మహోత్సవం
● ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయకుడు మింటు చురియ
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కొరాపుటియ కళా, కళాకారుల గ్రూపు వారిచే నిర్వహిస్తున్న పుష్‌పుణి మహోత్సవం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఒడిశాలో ప్రసిద్ధ గాయకుడు మింటు చురియ తన శ్రావ్యమైన కంఠంతో మృదుమధురమైన పాటలతో శ్రోతలను మైమరపించాడు. అలాగే పలు ఆదివాసీ నృత్య గీతాలను ఆదివాసీ కళాకారులు ప్రదర్శించి కొరాపుట్ ఆదివాసీ కళాసంస్కృతిని గుర్తు చేశారు. ముఖ్యంగా నవరంగపూర్ జిల్లా చందాహండి ఆదివాసీ కళాకారుల ఘుముర నృత్యం, కొరాపుట్ జిల్లా సెమిలిగుడ గిరిజన కళాకారుల రెంగ డాన్స్, బొయిపరిగుడ సమితి గిరిజనుల దురువ నృత్యాలు, డైనమిక్ డాన్స్ గ్రూపుడాన్స్‌లు ప్రజలను ఉత్సాహ పరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, గౌరవ అతిథిగా జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ్ గజదీస్ కాశ్యప్, సమాజ సేవి, ప్రముఖ క్రీడాకారులు సుభాష్ రౌత్‌లు పాల్గున్నారు. సబ్ కలెక్టర్ శొశ్యారెడ్డి మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లా ఆదివాసీ కళా సంస్కృతులకు పుష్‌పుణి మహోత్సవాలు దర్పణం పడుతున్నాయని, ఇటువంటి ఉత్సవాల ద్వారా ప్రాచీన సంస్కృతి కళలను పరిరక్షించుకోవాలని ఉద్బోధించారు. శంకర ప్రహరాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, అతిథులతో పాటు కొరాపుటియ కళ, కళాకారుల గ్రూపు అధ్యక్షులు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధిరెన్ మోహన పట్నాయక్ సహకరించారు.
ఉత్సాహంగా పుష్‌పుణి మహోత్సవం


