పర్మినెంట్ బీడీఓ కోసం విజ్ఞప్తి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో పర్మినెంట్ బీడీఓను నియమించాలని ఆ సమితి ప్రతినిధులు శుక్రవారం పంచాయతీ రాజ్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సమితి మాజీ అధ్యక్షుడు నరేంధ్ర కందాలియ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం భువనేశ్వర్ వెళ్లి పంచాయతీ రాజ్ మంత్రి రబి నాయిక్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. బొయిపరిగుడ సమితిలో కొత్త బీడీఓ బాధ్యతలు స్వీకరించలేదని, పనులు ఆగిపోతున్నాయని ఆయన తెలిపారు. జయపురం బీడీఓ శక్తి మహాపాత్రోకు బొయిపరిగుడ సమితి బీడీఓ బాధ్యతలు అదనంగా అప్పగించారని కానీ ఆయనకు సమయం సరిపోవడం లేదన్నారు. వెంటనే కొత్త బీడీఓను నియమించాలని కోరారు.
సెంచూరియన్ వర్సిటీలో
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో నర్సింగ్ స్కూల్ విద్యార్థులు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే (యు.హెచ్.వి.) శుక్రవారం జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నర్సింగ్ ఫ్యాకల్టీ సభ్యులు రశ్మి జెన్నా అన్నారు. కార్యక్రమం జి.కాంచన అనే విద్యార్థి ప్రారంభించారు. ప్రజల్లో జీవనవిధానం మార్పులు అవసరం అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ పథకం సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి శుభశ్రీ పాణిగ్రాహి, జి.అఖిల్, వి.ఈశ్వర్‌లు సహాయ సహకారాలు అందజేశారు.


