5 ఇ మోడల్ పుస్తకం ప్రజలకు అంకితం
జయపురం: స్థానిక విక్రమ విశ్వవిద్యాలయ నూతన అధ్యయన తృతీయ సభాగృహంలో 5 ఇ మోడల్ విద్యాదాన పద్ధతి పుస్తకం ప్రజలకు అంకితం చేశారు. 5 ఇ మోడల్ విద్యాదాన విశ్వవిద్యాలయ శిక్షక శిక్షణ విభాగం(బిఇడి) చీఫ్ ప్రభుత్వ ప్రొఫెసర్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, ప్రభుత్వ ప్రొఫెసర్ లోకేష్ ప్రదాన్ రచించిన 280 పేజీల విశిష్ట పరిశోధన పుస్తకాన్ని ముఖ్య అతిథి విశ్వవిద్యాలయ కులపతి మహేహేశ్వర చంద్ర నాయిక్, స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రోల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కులపతి, స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షులతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మహరాణ, పుస్తక రచయితలు వేదికపై ఆశీనులయ్యారు. రచయిత ప్రొఫెసర్ లోకేష్ ప్రధాన్ పుస్తకంలో పొందుపరచిన అంశాలపై వివరించారు. ఈ పుస్తకం ఎలా గుణాత్మక విద్య దానం అందజేసేందుకు ఉపయోగపడుతుందో వివరించారు. ముఖ్యఅతిథి మహేశ్వర చంద్ర నాయిక్ మాట్లాడుతూవిశ్వ విద్యాలయ ప్రొఫెసర్లు అమూల్యమైన పుస్తకం రచించినందుకు పుస్తక రచయితలను ప్రశంసించారు. ఈ పుస్తకం ద్వారా విక్రమ విశ్వవిద్యాలయం దేశమంతా పరిచయం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పుస్తకం రచన సాధారణమైన విషయం కాదన్నారు. పుస్తకాన్ని ప్రజలకు అంకితం చేసినందుకు రచయితలను ఆయన అభినందించారు. ఇక ముందు ఈ పుస్తకం ప్రచురిస్తే రంగులతో ముద్రించాలని ఆయన సూచించారు. రచయితల్లో ఒకరైన ప్రొఫెసర్ మనోరంజన్ ప్రధాన్ పుస్తకంలో అంశాలను వివరిస్తూ ఈ పుస్తకం బిఇడి,శిక్షా స్నాతకోత్తర(యం.ఇ.డి)ఎడ్యుకేషన్ హానర్స్, ఎంఏ ఎడ్యుకేషన్, కోర్సులతో పాటు అందరికీ ఉపయోగకరమన్నారు.
పుస్తకంలో 10 విభాగాలు ఉన్నాయని 5 ఇ మోడల్ విద్యాదాన పద్ధతి పుస్తకంలో తాంత్రిక, ప్రయోగాత్మక ఆలోచనతో పాటు, భౌతిక విజ్ఞానం, రసాయనిక విజ్ఞానం, ఆంగ్లం, ఒడియా భాషలతో పాటు చరిత్ర, అర్ధనీతి, విద్యా బోధన పద్ధతి, విద్యా బోధన పద్ధతుల నమూనాలు పుస్తకంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయిక్, అనుపమ మిశ్ర, పరచిత మహాపాత్రో, సుజాత బేజ్, ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు చందన మహారాణ, శుభశ్రీ పట్నాయిక్, సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు.
5 ఇ మోడల్ పుస్తకం ప్రజలకు అంకితం


