
మహిళలకు వడ్డీ రహిత కారు రుణం
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ‘అమొ సువాహక యోజన’ కింద మహిళల స్వయం సమృద్ధి సాధనకు కారు కొనుగోలుకు సహాయం చేయనుంది. నాలుగేళ్లలో కారు కొనడానికి అంచెలంచెలుగా 1,100 మంది మహిళలకు ఈ సౌలభ్యం కల్పిస్తుంది. మొదటి సంవత్సరంలో 200 మంది మహిళలు, రెండో సంవత్సరంలో 250 మంది, మూడో సంవత్సరంలో 300 మంది, నాల్గో సంవత్సరంలో 350 మంది మహిళలు ప్రయోజనం పొందుతారు. వీరిలో ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందజేస్తుంది. ఈ వ్యయ ప్రణాళిక అంచనా రూ. 46.66 కోట్లు. ఈ సదుపాయం పొందిన మహిళలు కారును టాక్సీలుగా వినియోగించాల్సి ఉంటుంది. వారు ఐదేళ్ల నిడివిలో సమాన వాయిదాలలో ప్రధాన రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడం నిబంధన. రుణ మొత్తంపై 11 శాతం వార్షిక వడ్డీ రేటుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా చెల్లిస్తుంది. వాణిజ్యం, రవాణా శాఖ ప్రతిపాదించిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు పరిమితమైన 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మంగళ వారం తెలిపారు. డిసెంబర్ 2023లో ప్రారంభించిన సువాహక్ చొరవ విస్తరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ పొందిన 6,000 మందికి పైగా మహిళలకు ఈ పథకం కింద ప్రోత్సాహం లభిస్తుంది. రాగల 4 ఆర్థిక సంవత్సరాల్లో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కోసం సహాయపడటం ఈ పథకం లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ బస్సులు నడపడంలో నిమగ్నమై ఉన్న మహిళలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు సుభద్ర లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడానికి, విద్యుత్ వాహనాలను (ఈవీ) ఎంచుకునే మహిళలకు రాష్ట్ర ఈవీ విధానానికి అనుగుణంగా రూ. 2 లక్షల ప్రోత్సాహకం లభిస్తుంది. రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపులు లభిస్తాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సడక్ సురక్ష మౌళిక అభివృద్ధి యోజన కింద బడ్జెట్ కేటాయింపుల నుంచి నిధులు సర్దుబాటు చేసే యోచన ఉన్నట్లు తెలిపారు.