
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం
● డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక
రాయగడ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన ఆయనకు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జిల్లాలో ఎంతగానో ఆదరించారని, దీని ఫలితంగానే జిల్లాలోని మూడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలిగారన్నారు. అదేవిధంగా కొరాపుట్ లోక్‌సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కై వసం చేసుకుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పార్టీ మరింత బలం పుంజుకునేందుకు తాను కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు డీసీసీ పదవిని ఇచ్చిందన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసి అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని వెల్లడించారు. అనంతరం లోక్‌సభ ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ.. పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుణుపుర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, సీనియర్ నాయకురాలు రత్నమణి ఉలక తదితరులు పాల్గొన్నారు.