● త్వరలో వాకీ టాకీ వ్యవస్థ– మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం భద్రతా వ్యవస్థ పటిష్టపరిచే దిశలో కదలిక ఆరంభమైంది. శ్రీ మందిరంలోనికి మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. భద్రత ఉప కమిటీ ప్రముఖుడు గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన నీలాద్రి భక్త నివాసంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. పూరీ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్, సీనియర్ అధికారులు, సేవాయతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు సురక్షిత దర్శనం మరియు శ్రీ మందిరం భద్రతపై ప్రధానంగా చర్చించారు. శ్రీ మందిరంలో వాకీ టాకీ వ్యవస్థ అమలు అవుతుంది. శ్రీ మందిరంలో మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించబడతాయి. పోలీసులు, సేవా సిబ్బంది కూడా ఫోన్లు తీసుకెళ్లలేరని సమావేశం తర్వాత భద్రతా ఉప కమిటీ అధ్యక్షుడు గిరీష్ ముర్ము తెలిపారు. ఆలయ అంతర్గత మరియు బాహ్య భద్రతపై చర్చించినట్లు తెలియజేశారు. ఇతర దేవాలయాల భద్రత వ్యవస్థను పరిశీలించిన తర్వాత శ్రీ మందిరం భద్రత వ్యవస్థని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
శ్రీ మందిరం భద్రతా ఉప కమిటీ సమావేశం