
రైలు ఢీకొని వ్యక్తి మృతి
నందిగాం: మండల పరిధిలోని కవిటి అగ్రహరం వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పలాస రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పలాస మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని, ఎడమ చేతిపై ఇంగ్లిష్‌లో సుశాంత అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ పోలీసులను సంప్రదించాలన్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పాతపట్నం: గంగువాడ గ్రామానికి చెందిన రావలవలస ధర్మారావు(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారావు ఈ నెల 12న మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన ధర్మారావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో అనుబంధ విభాగాల నియామకం త్వరితగతిన చేపట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ, పాతపట్నం నియోజకవర్గ పరిశీలకుడు పాలవలస విక్రాంత్, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిశీలకుడు దుంపల లక్ష్మణరావు, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడు శాడి శ్యాంప్రసాద్‌రెడ్డి కోరారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో నాయకులను, పార్టీ కార్యకర్తల్ని సమన్వయపరచాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌డీసీ, కేఆర్‌ఆర్‌సీ, పీజీఆర్‌ఎస్ వంటి రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, కోర్టు కేసులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ నెల 18లోగా ఈ పంట వివరా ల నమోదు ప్రక్రియ నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో లక్ష్యాన్ని చేరుకున్న లావేరు మండల బృందాన్ని అభినందించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 11 గ్రామాలు ఎంపికయ్యాయని వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాల గురించి ఆరా తీశారు. వారంలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిమాండ్ ఉన్న చోట్ల ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చెప్పారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
నందిగాం: నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. వీరిని 108 వాహనం, నేషనల్ హైవే అంబులెన్స్‌లలో టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పిట్ట రాధమ్మ(60) మంగళవారం మృతి చెందింది. ఈమె స్వస్థలం ఇచ్ఛాపురం మండలం ధర్మపురం. ఒడిశా రాష్ట్రం రాయగడలో మజ్జి గౌరమ్మని దర్శనం చేసుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
‘ఎదుగుదల
ఓర్వలేకే నిందలు’
ఇచ్ఛాపురం: రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే కొంతమంది కూటమి నేతల సహకారంతో వ్యక్తిగతంగా నిందారోపణలు చేస్తున్నారని ఇచ్ఛాపురం జనసేనపార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు, మామయ్యకు మధ్య పెనుగులాట మాత్రమే జరిగిందని, తాను ఎవరిపైనా దాడిచేయలేదని స్పష్టం చేశారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి