
మెరుపుల సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్‌లు వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్ చేయకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. గ్రానైట్ యాజమాన్యాలతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీలో భద్రత, రక్షణ ముఖ్యమన్నారు. కార్మికుల భవిష్యత్‌కు భరోసాగా గ్రూపు ఇన్సూరెన్సు ఉండాలన్నారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. గ్రానైట్ ఇండస్ట్రీస్‌పై ట్రైనింగ్ సెంటర్‌కు భూమి కేటాయిస్తానన్నారు. ఈఎస్‌ఐలో ఉంటే అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కలెక్టర్‌కు వివరించారు. ఈఎస్‌ఐ పెట్టుకునేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉన్నట్టు చెప్పారు. గ్రానైట్ కార్మికుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు 10 సెంట్లు భూమి కావాలని గ్రానైట్ అసోసియేషన్ కోరగా భూమి ఇవ్వాలని టెక్కలి ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. లైసెన్సులు లేని క్రషర్స్ ఉంటే ఆపివేయాలన్నారు. వాతావరణ కేంద్రం జారీ చేసిన వాతావరణ పరిస్థితుల ఆధారంగా తక్షణమే సైరన్ వేయాలని చెప్పారు. భూ గర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహనరావు మాట్లాడుతూ గ్రానైట్ కార్మికులకు కార్మిక శాఖ బీమా కల్పించాలని, అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. లైసె న్సు ఉన్న వారితోనే బ్లాస్టింగ్ చేయించాలన్నారు.