
నవంబర్ 23న స్పందన వార్షికోత్సవం
● వివిధ పోటీల నిర్వహణకు నిర్ణయం
రాయగడ: స్థానిక స్పందన సాహితీ, సాంస్తృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని నవంబర్ 23వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సభ్యుల సమావేశంలో సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరీశంకర్ ప్రకటించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థుల మధ్య వివిధ పోటీలను నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. అలాగే మహిళల మధ్య మెహేందీ పోటీలతో పాటు విద్యార్థుల మధ్య చిత్రలేఖనం, విచిత్ర వేషధారణ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 1995 ఆగస్టు 15వ తేదీన ఆవిర్భవించిందని సంస్థ సాంస్కతిక విభాగం కార్యదర్శి కొండవలస క్రిష్ణమూర్తి పట్నాయక్ అన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడంలో సంస్థ విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. సమావేశంలో సంస్థ సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు పాల్గొన్నారు.