
శ్రీ మందిరంపై ఎగిరిన డ్రోన్ స్వాధీనం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని ఆలయ శిఖరంపై చక్కర్లు కొట్టిన డ్రోన్‌ను భద్రతా దళాలు స్వాధీనపరచుకున్నారు. శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్‌గా లోగడ ప్రకటించారు. ఇటీవల ముగిసిన రథ యాత్ర సందర్భంగా డ్రోన్ వ్యతిరేక ప్రాంతంగా ప్రకటించారు. అధికారిక ప్రకటనలు ఇలా ఉండగా తరచూ ఆలయ శిఖరంపై తరచు డ్రోన్ చక్కర్లు కొట్టడం, డ్రోన్ వీడియో రికార్డింగు క్లిప్‌లు సాంఘిక మాధ్యమంలో ప్రసారం కావడం భక్తజన హృదయాల్ని కలవరపరుస్తున్నాయి. తాజాగా శ్రీ మందిరం ప్రాంగణం రెడ్ జోన్‌లో చేర్చినట్లు పౌర విమాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. తాజా సంఘటనలో శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక శని మందిర్ వీధిలో డ్రోన్ స్వాధీనపరచుకున్నారు. డ్రోన్‌ను ఎగురవేసిన చత్తీస్‌గఢ్‌కు చెందిన యువకుడిగా గుర్తించి రెడ్ జోన్ నిబంధనల పరిధిలో అరెస్టు చేసినట్లు పూరీ జిల్లా పోలీసులు తెలిపారు.