
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
● మరొకరికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి సికరపాయిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు సికరపాయిలోని డొంగిరియా వీధికి చెందిన నిరంజన్ మినియాక (30)గా గుర్తించగా గాయాలు తగిలిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన నవీన్ తియాకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. క్షతగాత్రున్ని చికిత్స కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి పంపించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సికరపాయిలో జరుగుతున్న గజలక్ష్మి పూజలను చూసేందుకు నిరంజన్ తన బైక్‌పై తన గ్రామం నుంచి వెళ్లాడు. అదే సమయంలో పూజ మండపం వద్ద ఎదురుగా మరో బైకుపై వస్తున్న నవీన్ అదుపుతప్పి ఇద్దరు ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు బైకుల పైనుంచి కింద పడిపొగా సంఘటన స్థలం వద్దే నిరంజన్ తీవ్రగాయాలకు గురై మృతి చెందగా నవీన్ గాయాల పాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగు పడి ముగ్గురికి గాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా తామ్సా పంచాయతీ చాంపాఖారి గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన శంకర్ గోలారీ అనే వ్యక్తి తన కుటుంబంతో ఇంటిలో నిద్రపోతున్న సమయంలో పైకప్పుపై పిడుగు పడింది. దీంతో ముగ్గురు గాయపడ్డారు. ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఆస్పత్రిపైనుంచి పడి వ్యక్తి మృతి
ఎంవీపీ కాలనీ: కోరాపుట్‌కు చెందిన పూజారి నరసింగ్(28) అనే వ్యక్తి ఎంవీపీ కాలనీలోని మెడికవర్ ఆస్పత్రి 5వ అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసింగ్ కోరాపుట్ జిల్లా కెండుగూడ గ్రామంలో కుటుంబ సభ్యులతో నివసిస్తూ.. స్థానిక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అతను మద్యానికి బానిస కావడంతో పూజారి విధుల నుంచి గ్రామస్తులు తొలగించారు. దీంతో మద్యానికి మరింతగా బానిసయ్యాడు. ఇటీవల అతని స్నేహితురాలు తులసిదాస్ అత్తగారికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెతో కలిసి మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆస్పత్రిలో కనిపించకపోవడంతో అతని భార్య పున్నీ పూజారికి తులసీదాస్ ఫోన్‌చేసి తెలియజేసింది. అయితే అదేరోజు అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రి 5వ అంతస్తు నుంచి పడిపోవడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను, వారి బంధువులను అప్రమత్తం చేయడంతో తులసి దాస్ చనిపోయిన వ్యక్తి తనతోపాటు వచ్చిన నరసింగ్‌గా గుర్తించి ఆస్పత్రి వర్గాలకు తెలిపింది. వారు అత్యవసర వైద్య విభాగానికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అతని భార్య పున్నీ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త మద్యానికి బానిసై కొంతకాలంగా మతిస్థితిమితం లేకుండా తిరుగుతున్నాడని, ఈ క్రమంలో ఆస్పత్రి పైఅంతస్తు నుంచి పడిపోయి ఉంటాడని, అతని మృతిపై ఎలాంటి అనుమానం లేదని భార్య పున్నీ పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం