
ఎస్‌డీసీ నిధులు దారి మళ్లింపు
● ఎస్‌డీసీ మాజీ ముఖ్య సలహాదారుడు ప్రదీప్ మాఝి
రాయగడ: ఆదివాసీల అభ్యున్నతికి, వారి భాష, సంసృతి, విధి విధానాలను పరిరక్షించేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభివృద్ధి మండలి (ఎస్‌డీసీ) ఎంతగానో దొహదపడుతుండేదని ఎస్‌డీసీ మాజీ ముఖ్య సలహాదారుడు, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి అన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్‌డీసీని రద్దు చేయడం విచారకరమన్నారు. రద్దయిన తరువాత రాయగడ జిల్లాలో ఎస్‌డీసీకి సంబంధించిన సుమారు 4 కోట్ల రుపాయల నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. స్థానిక హోటల్ కై లాస్‌లో ఈ మేరకు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీ జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడలో ఎస్‌డీసీకి మంజూరైన నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. రాయగడ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించే ఫరూల్ పట్వారీ, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిష్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి కుమ్మకై ఆదివాసీల అభివృద్ధి కోసం వచ్చిన నిధుల్లో సుమారు 4 కోట్ల రుపాయల నిధులు దారిమళ్లించారని ఆరోపించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని, లేదంటే తాము ఆందోళన చేయడం ఖాయమని హెచ్చరించారు. ఆదివాసీ పిల్లల కోసం ఆట వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎస్‌డీసీని రద్దు చేసిన అనంతరం ఆ నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ మాజీ చైర్మన్ (రాయగడ) అనసూయ మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరక పాల్గొన్నారు.