
నవీన్ పట్నాయక్‌ను కలిసిన ఎంపీ దంపతులు
భువనేశ్వర్: స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అపరాజిత షడంగి దంపతులు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలతో సంభాషించారు. గతంలో జరిగిన అనేక సంఘటనలను ప్రేమగా గుర్తుచేసుకుని వీరివురి మధ్య సంభాషణ సంతోషకరంగా కొనసాగిందని ఎంపీ అపరాజిత షడంగి తెలిపారు. ఈ సమావేశం పరస్పర గౌరవం, సానుకూల రాజకీయాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. నవీన్ పట్నాయక్ వినయం మరియు రాజకీయ సరిహద్దులకు అతీతంగా జీవిస్తు రాష్ట్ర ప్రజలు మరియు ఆయన అధీనంలో పని చేసిన అధికారులు తదితర వర్గాల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించారు. భువనేశ్వర్ ఎంపీగా వరుసగా 2 సార్లు ఎన్నికై అధికారంలో కొనసాగుతున్న అపరాజిత షడంగి నవీన్ పట్నాయక్ హయాంలో రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా తనదైన ప్రత్యేక శైలితో పలు అధికారిక, పాలనాపరమైన సంస్కరణలు ఆవిష్కరించి నవీన్ పట్నాయక్ ప్రసంశలు అందుకున్నారు. అధికారిక దక్షతతో ప్రజల ప్రేమ మరియు విశ్వాసాన్ని గెలుచుకున్న మహిళా అధికారిగా అపరాజిత షడంగి సరళత, నిజాయితీ మరియు సామాన్య ప్రజలతో సన్నిహిత సంబంధాలను సొంతం చేసుకున్నారు. సమ భావాలు కలిగిన ఈ ఇరువురు నాయకులు సమయోచితంగా సమావేశమై సంభాషించుకోవడం రాజకీయ విభేదాల కంటే మానవత్వం మరియు పరస్పర గౌరవాభిమానాలు విలువైనవని చాటి చెప్పారు.

నవీన్ పట్నాయక్‌ను కలిసిన ఎంపీ దంపతులు