
పిడుగు పడి పశువులు దుర్మరణం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో శనివారం పిడుగు పాటుకు మూడు పశువులు దుర్మరణం పాలయ్యాయి. ఈ సంఘటన బొయిపరిగుడ సమితి కొలార్ గ్రామ పంచాయతీ హతిపకన సమీపం గదియగుడ గ్రామంలో జరిగిందని సమాచారం. ఆ గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం అకస్మాత్తుగా పడి పిడుగులు పడటంతో ఒక ఆవుతోపాటు రెండు మేకలు మరణించాయి. అందిన సమాచారం ప్రకారం గదియగుడ గ్రామంలో ఒక పశువుల కాపరి ఆవులు గొర్రెలు, మేకలను మేతకు గ్రామ సమీపంలో అడవికి తీసుకువెళ్లాడు. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడటంతో అతడు చెట్టు కిందకు వెళ్లి తల దాచుకున్నాడు. ఆ సమయంలో పశువులు ఉన్న చోట పిడుగులు పడ్డాయి. ఆ ప్రమాదంలో ఒక ఆవు, రెండు మేకలు మరణించాయి. పశువుల కాపరి పిడుగు పడిన చోటుకి కొంత దూరంలో ఉండటం వల్ల అతడు తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పిడుగు పడి ఆ గ్రామం భీమ బొడొనాయిక్ ఆవు, రతన శిశా,గురు కిరసానిల రెండు మేకలు మరణించాయని తెలిపారు.