
చర్యలు తీసుకోరు..?
● ఎచ్చెర్ల సీడీపీవోపై కాంట్రాక్టర్ ఫిర్యాదు
● లంచం అడిగారని ఆరోపణ
● జీసీకి నివేదికలు ఇవ్వని ఐసీడీఎస్ పీడీ
● చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
నివేదికలు
ఇవ్వరు..
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ సెంటర్లకు బాలామృతం ప్యాకెట్లు సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును పైడి వెంకటరమణ చేస్తున్నాడు. ఈ అగ్రిమెంట్ 2026 మార్చి వరకు ఉంది. ప్రాజెక్టు పరిధిలో 116 అంగన్‌వాడీ సెంటర్లకు ఈయనే కాంట్రాక్టర్. ప్రభుత్వం రవాణా చార్జీ కింద ఒక్కో ప్యాకెట్‌కు రూ.5లు చొప్పున చెల్లిస్తోంది. ఇటీవల 14 నెలల బిల్లులు సుమారు రూ.1,75,000లు విడుదలయ్యాయి. వీటిలో ప్యాకెట్‌కు రూ.0.75 పైసలు వంతున.. అంటే సుమారు రూ.40 వేలు లంచంగా ఇవ్వాలని సీడీపీవో డోల పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. దీంతో వీరిరువురిపై పూర్తి ఆధారాలతో ఈనెల 22న కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కాంట్రాక్టర్ పైడి వెంకటరమణ ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు చేసి 15 రోజులైనా...
మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎచ్చెర్ల చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) డోల పాపినాయుడుపై ఫిర్యాదు వచ్చి 15 రోజులు పూర్తయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. సీడీపీవో అవినీతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తన చాంబర్‌లో నేరుగా దర్యాప్తు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి నివేదిక వెంటనే అందజేయాలని, అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు ఉంటుందని ఆ సమావేశంలోనే ఐసీడీఎస్ పీడీకి స్పష్టం చేశారు. అయినా ఇప్పటివరకు ఐసీడీఎస్ పీడీ నివేదికలు జేసీ కార్యాలయానికి ఇంతవరకు అందజేయలేదు. ఒకసారి షోకాజ్ నోటీసుకి సమాధానం తెలిపినా.. దానిపై జేసీ సంతృప్తి చెందలేదు. స్పష్టమైన నివేదిక అందజేయాలని ఆదేశించారు.
మరలా ఫిర్యాదు
15 రోజుల ముందు చేసిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో వెంకటరమణ మరలా గతవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరలా పీడీ కార్యాలయం నుంచి విచారణకు జేసీ పిలిపించారు. అయితే పీడీ కార్యాలయం వారు జేసీ లేని సమయంలో వెళ్లి, ఆయన లేరని దాటవేస్తున్నారు. వారంలో రోజులుగా జేసీని వారు కలవలేదు. జేసీ ఆదేశాల మేరకు అక్కడ పనిచేస్తున్న సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఐసీడీఎస్ పీడీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయన వీరిద్దరినీ కాపాడుతున్నారని తెలుస్తోంది. వెంకటరమణ చేసిన ఫిర్యాదుపై చర్యలు లేకుండానే ఇటీవల ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ఆ సమస్య పరిష్కారమైనట్లు ఎండార్సుమెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం.