
ధాన్యం డబ్బులు చెల్లించండి
జయపురం: గత రబీ సీజన్‌లో తాను మండీలో అమ్మిన ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరుతూ ఒక రైతు జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్ సమితి చిత్ర గ్రామానికి చెందిన రైతు కృష్ణ కమర నాలుగు నెలల క్రితం కోట్‌పాడ్ సమితి చిత్ర ధాన్యం మండీలో 37 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. అయితే లేంప్స్ కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్ తప్పుగా వేయడం వలన తనకు రావాల్సిన రూ.1.14 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
గుడారిలో గంజాయి స్వాధీనం
రాయగడ: గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లాలోని గుడారి పోలీసులు ఆకస్మిక దాడులను నిర్వహించి అందుకు సంబంధించి నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి రూ.177 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ బీరేంద్ర రాయ్, ఎస్‌ఐ సంజయ్ ఛత్రలు తెలియజేసిన వివరాల ప్రకారం గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిగిగుడ గ్రామ సమీపంలో గల ఒక తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందటంతో ఈ దాడులను నిర్వహించినట్లు తెలియజేశారు.
రైల్వే ప్రయాణికుల సలహాల సేకరణ
కొరాపుట్: అమ్రిత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికుల సలహాలు రైల్వే శాఖ అధికారులు తీసుకున్నారు. శనివారం కొరాపుట్ రైల్వే స్టేషన్‌లో ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) కె.రామారావు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి.. స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులతో మమేకమయ్యారు. స్టేషన్లలో సౌకర్యాలు, అభివృద్ధి, లోపాలు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పలవురు ప్రయాణికులు స్వయంగా వచ్చి సూచనలు చేశారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రిక్ ఇంజినీర్ ఎం.ఎస్.ఎన్.మూర్తి పాల్గొన్నారు.
అభ్యంతరకర పోస్టు..
యువకుడి అరెస్టు
రాయగడ: సామాజిక మాధ్యమాల్లో రాయగడ జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో పై అభ్యంతరకరమైన పోస్టులను ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు సదరు పోలీసులు దిలీప్ కుమార్ పాఢి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కుహొరొపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంతో కుహొరొ కలెక్టర్ అశుతొష్ కులకర్ణి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌కు ఈ విషయాన్ని తెలిపారు. శనివారం యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని అరసవల్లి సెగిడివీధికి చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. పాతబస్టాండ్‌లో పండ్ల దుకాణం నడుపుతున్న పొట్నూరు వెంకటరమణకు కుమార్తె, కుమారుడు సాయికృష్ణ (28) ఉన్నారు. సాయికృష్ణ ఇంటి వద్దనే ఉంటూ సివిల్స్‌కు ప్రిపేరయ్యేవాడు. ఈ ఏడాది జనవరి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడో దూరంగా ఉంటూ చదువుకుంటాడని భావించి వెతకడం మానేశారు. నెలలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో శనివారం రాత్రి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

ధాన్యం డబ్బులు చెల్లించండి

ధాన్యం డబ్బులు చెల్లించండి