
పేకాట శిబిరంపై దాడి
పర్లాకిమిడి: లబార్ సింగి వద్ద పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడి జరిపి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. గజపతి జిల్లాలో మోహన పోలీస్‌స్టేషన్ పరిధిలో చంద్రగిరి జీపీ లబార్‌సింగి వద్ద పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.12,200లు తోపాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌లో మహిళా యాంకర్ మీనా ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మీనా గత నెల 21న బీరువాలో భద్రపరిచిన బంగారు వస్తువులు చోరీకి గురవ్వడంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన ది సీపన్నాయుడుపేటకు చెందిన బెండి అజ య్‌గా గుర్తించారు. ఈయనపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అజయ్ నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
టెక్కలి: అన్ని రకాల భూమిపత్రాలతో సాగు చేస్తున్న భూములను ఇప్పటికిప్పుడు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేసి తమను అన్యాయం చేస్తున్నారని కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అధికారులు తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెద్దబమ్మిడి సర్పంచ్ మెండ తాతయ్య సహకారంతో గ్రామంలోని పోరంబోకు భూమిని సుమారు 38 మంది నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి 26 సెంట్లు చొప్పున కేటాయించారు. భూ పట్టాలతో పాటు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం, ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింపజేశారు. ప్రస్తుతం ఆయా భూముల్లో వ్యవసాయం, ఇతర పంటలను పండిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా శుక్రవారం రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంతో దళితులంతా ఆందోళన చెందుతున్నారు.
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగిగా పనిచేస్తున్న గంగు మోహనరావు పాతిన వాని పేటలో వీధిలైట్లు వేస్తుండగా స్తంభం నుంచి జారిపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా బాధితుడిని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు జెమ్స్‌కు తరలించారు. బాధితుడి తలకు గాయాలయ్యాయని, చేయి విరిగిందని, మున్సిపల్ అధికారులు ఒక రోజంతా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో మున్సిపల్ కమిషనర్ టి.రవి శనివారం సాయంత్రం జెమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. విద్యుత్ సమస్యలపై వేళాపాళా లేకుండా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వాడుకుంటున్నారని, ప్రమా దం సంభవించినప్పుడు విడిచి పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.