
భక్తిశ్రద్ధలతో దుర్గాష్టమి పూజలు
జయపురం: జయపురం చారిత్రాత్మక దసరా ఉత్సవాల్లో ప్రధాన దేవతల్లో ఒకరు పూర్ణఘడ్‌లో వేంచేసి ఉన్న మా దక్షిణ కాళీ జన్మస్థలం పనసపుట్‌బగరలో మంగళవారం ఘనంగా దుర్గాష్టమి పూజలు జరిగాయి. జయపురం పట్టణానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న పనసపుట్‌బగర గ్రామం సమీప కొండపై పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద సేవన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాళీమాత చెల్లి దుర్గా మాతకు ప్రజలు అష్టమి పూజలు జరిపి దసరా వేడుకలు జరపటం కొన్ని శతాబ్దాల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆ గ్రామంలో ముఖ్య వ్యక్తి సరోజ్ మహంతి వెల్లడించారు. రెండు వందల సంవత్సరాలకు పూర్వం గ్రామం సమీప పర్వతంపై ఇద్దరు అక్క చెల్లెల్లు దుర్గ, దక్షిణ కాళీలను అనాదిగా ఆ ప్రాంత ప్రజలు కొలుచేవారు. ఏ కారణం చేతనో జయపురం పట్టణంలో ఖడంగా కుటుంబానికి గ్రామస్తులు దక్షిణ కాళీ విగ్రహాన్ని విక్రయించారు. ఖడంగా కుటుంబం దక్షిణ కాళీ విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. కొంత కాలం తరువాత ఖడంగా కుటుంబ సభ్యులు దక్షిణ కాళీ విషయం జయపురం రాజుకు తెలియజేశారు. ఆ సమమంలో నక్కిడొంగర పర్వతంపై కోట నిర్మించి అక్కడ నుంచి జయపురం రాజులు పాలించేవారు. అందువల్ల ఆ ప్రాంతంలో (నేటి పూర్ణఘడ్) ఒక గుడిశ నిర్మించి అందులో దక్షిణ కాళీ విగ్రహాన్ని అప్పటి రాజు ప్రతిష్టించారు. అప్పటి నుంచి పూర్ణఘడ్‌లో మా దక్షిణ కాళీ, పనసపుట్‌బగరా పర్వతంపై మా దుర్గదేవి పూజలు అందుకున్నారు. పనసపుట్‌బగరలోగల మా దుర్గా దేవికి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. దక్షిణ కాళీ, మా దుర్గ దేవత మూర్తులకు దసరా వేడుకల్లో ఘనంగా పూజలు, ఉత్సవాలు జరుపుతూ వస్తున్నారు. మంగళవారం పనసపుట్ బగరా పర్వతంపై అంగరంగ వైభభవంగా పూజలు జరిపారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పనసపుట్ బగర గ్రామం నుంచి ఆ గ్రామ యువకులు, బాలికలు పూజా, భోగానికి సామగ్రి తీసుకువచ్చి దక్షిణ కాళీ మాతకు సమర్పించిన తరువాత దక్షిణ కాళీ ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని గ్రామస్తులు వెల్లడించారు. ఈ ఆచారం రాజుల కాలం నుండి వస్తుందని వెల్లడించారు. కాల క్రమేణా రాజుల పర్యవేక్షణంలో దక్షిణ కాళీ మందిరం అభివృద్ధి చెందినా పనసపుట్‌బగర పర్వతంపై ఉన్న దుర్గా మాత పీఠం అభివృద్ధికి నోచుకోక లేకపోయిందని గ్రామ పెద్దలు తెలిపారు.