
సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు గురు వారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు సకాలంలో హాజరయ్యారు. స్పీకర్ అనుమతి మేరకు ఉదయం 11 గంటల నుంచి సభా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అంతకు ముందు శాసన సభ ఆవరణలో స్పీకర్‌కు గౌరవ కవాతుతో స్వాగతించారు. సభా కార్యకలాపాలు ఆరంభానికి స్పీకర్ అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి దివంగత సభ్యులకు సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో ఏడుగురు మాజీ సభ్యులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు సిబ్బంది మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దివంగతులకు ఘనంగా నివాళులర్పించారు. తోటి సభ్యులు ఽరాజేంద్ర ఢొలొకియా, కరేంద్ర మాఝీలతో కలిసి పని చేసిన అనుభవాల్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఇద్దరు కానిస్టేబుళ్ల త్యాగాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం సభ కార్యకలాపాలు వాయిదా వేసినట్లు స్పీకర్ సురమా పాఢి ప్రకటించారు. మర్నాడు శుక్రవారం ఉదయం ఆరంభం సమయం వరకు సభా కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడినట్లు ఆదేశించారు.
ఈ సందర్భంగా దివంగత నువాపడా నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా, మాజీ డిప్యూటీ స్పీకర్ బిభూతి భూషణ్ సింగ్ మర్దరాజ్, మాజీ సభ్యులు ప్రసన్న పట్నాయక్, కరేంద్ర మాఝి, నిరంజన్ హేంబ్రమ్, ప్రఫుల్ల కుమార్ భంజ్, మహ్మద్ రఫీక్ మరియు పోలీసు జవానులులోక్‌నాథ్ సబర్, లక్ష్మణ్ మాఝి మృతి పట్ల నివాళులు అర్పించారు. దివంగత సభ్యులకు గౌరవ సూచకంగా ఎమ్మెల్యేలు 2 నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించారు. విపక్ష బిజూ జనతా దళ్ ఉప నాయకుడు డాక్టరు ప్రసన్న ఆచార్య, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రామ చంద్ర కదమ్, భారత కమ్యునిస్టు పార్టీ (ఎం) ఏకై క సభ్యుడు లక్ష్మణ్ ముండా దివంగత నాయకులు, పోలీసు సిబ్బందికి తమ సంతాపం తెలిపారు. సభ తరఫున దివంగత సభ్యులు, కానిస్టేబుళ్ల కుటుంబాలకు స్పీకర్ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె తన సంతాప సందేశంలో ప్రతి మాజీ సభ్యుడి సహకారాన్ని కూడా ప్రస్తావించారు. రాజేంద్ర ఢొలికియా కొనసాగుతున్న 17వ సభ సిట్టింగ్ సభ్యుడు కాబట్టి సంప్రదాయం ప్రకారం తొలి రోజు సభ కార్యకలాపాలు వాయిదా వేసినట్లు స్పీకర్ పేర్కొన్నారు. గురు వారం ప్రారంభమైన శాసన సభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 21న ఒక విరామంతో సెప్టెంబర్ ఈ నెల 25 వరకు స్వల్పంగా 7 రోజుల నిడివితో కొనసాగాల్సి ఉంది. ఈ వ్యవధిలో ఈ నెల 21 విరామ దినంగా ప్రకటించారు.

సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ

సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ