
ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. శాసన సభ కార్యదర్శి ద్వారా స్పీకర్‌కు ఈ ప్రతిపాదన అందజేసింది. ఈ తీర్మానానికి 15 మంది పార్టీ ఎమ్మెల్యేల ముందస్తు మద్దతుతో ప్రతిపాదన దాఖలు చేసింది. 14 మంది కాంగ్రెస్, ఒక సీపీఐఎం ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు.
విపక్షం సాయం కోసం నిరీక్షణ
ప్రభుత్వ వ్యతిరేక అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సహాయ సహకారాల కోసం నిరీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు శాసన సభ నాయకుడు రామచంద్ర కదమ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ప్రతిపక్ష బిజూ జనతా దళ్ నాయకుల్ని కలిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ బిజూ జనతా దళ్ మద్దతు కోసం ఎమ్మెల్యే ప్రతాప్ కేశరి దేవ్‌ని సంప్రదించినట్లు తెలిపారు. పార్టీ సమావేశంలో ఈ విషయంపై చర్చించి తమ నిర్ణయం తెలియజేస్తామని అభయం ఇచ్చినట్లు తెలిపారు.
ఒంటరిగానైనా అవిశ్వాసం తెస్తాం: రాజన్ ఎక్కా
ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుందని, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతో మేము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెసు ఎమ్మెల్యే రాజన్ ఎక్కా తెలిపారు. ఈ మేరకు బీజేడీని అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని అభ్యర్థించాం. వారు అవిశ్వాస తీర్మానం తీసుకురాకపోతే, మేము దాన్ని తీసుకువస్తామని ముందుగానే స్పష్టం చేశాం. ఈ క్రమంలో కాంగ్రెస్ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందని రాజన్ ఎక్కా వివరించారు. ఈ పరిస్థితుల్లో విపక్ష బిజూ జనతా దళ్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందా లేదా సభలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందా? అనే సందిగ్ధత సర్వత్రా నెలకొంది. ఇంత వరకు బీజేడీ కాంగ్రెసు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు విషయం స్పష్టం చేయలేదు.
ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు
మరోవైపు అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంది. సభలో సంఖ్యా గరిష్టతతో ఈ ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. రాష్ట్ర శాసన సభలో మొత్తం 147 స్థానాలు. వాటిలో ఒక స్థానం ఖాళీగా ఉంది. విపక్ష బిజూ జనతా దళ్ అభ్యర్థి రాజేంద్ర డొలొఖియా అకాల మరణంతో ఈ ఖాళీ ఏర్పడింది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ బలం అత్యధికంగా 78 మంది సభ్యులు కాగా విపక్ష బిజూ జనతా దళ్ బలం 50, కాంగ్రెస్‌కు 14 మంది సభ్యుల బలం కొనసాగుతుంది. వామపక్షం (సీపీఎం) 1, ఇతరులు 3 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా విపక్షాలతో సహా ఇతర సభ్యులు చేయి కలిపిన మొత్తం బలం 68కి పరిమితం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదని అధికార పక్షం నిశ్చలత ప్రదర్శిస్తుంది.

ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం