
తీర్థయాత్రలకు 72 మంది ప్రయాణం
పర్లాకిమిడి: ప్రభుత్వ వయోవృద్ధుల తీర్థయాత్రల పథకంలో భాగంగా వారణాసి, అయోధ్యకు గురువారం రెండు బస్సులను జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి పచ్చజెండా ఊపి గజపతి స్టేడియంలో ప్రారంభించారు. ఆరు రోజుల అయోధ్య, వారణాసి తీర్థయాత్రలకు గజపతి జిల్లా నుంచి 72 మంది వయోవృద్ధులు టూరిజం శాఖ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న పిమ్మట లాటరీ తీసి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గజపతి ఇండోర్ స్టేడియంలో వయో వృద్ధులకు భోజనాలు ఇప్పించి, వారికి ఆరోగ్యం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్థయాత్ర పథకం గత రెండేళ్ల నుంచి అమలు చేస్తోంది. యాత్రికులు పర్లాకిమిడి నుంచి బరంపురం చేరుకుని శుక్రవారం వేకువజామున ప్రత్యేక తీర్థయాత్రల రైలుబండిలో బయలు దేరనున్నట్టు ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ యాత్రికులకు వివరించారు. వయోవృద్ధులు బరంపురానికి చేరుకునే లోపు ప్రతి ఒక్కరికీ ఐటెంటిటీ కార్డులు అందజేస్తామని, ఎలాంటి పరిస్థితిలో వాటిని తీయరాదని డీసీపీయూ త్రిపాఠి సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు తెలుగులో మాట్లాడుతూ, తీర్థయాత్ర చేస్తున్న వయోవృద్ధులకు తోడుగా మెడికల్ టీమ్ ఉంటుందని, ఇద్దరు అధికారులు కూడా వస్తారని తెలిపారు. యాత్రలకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి లవనేందు మహాంతి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

తీర్థయాత్రలకు 72 మంది ప్రయాణం

తీర్థయాత్రలకు 72 మంది ప్రయాణం