
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు..విపక్షాలు సిద్ధం
భువనేశ్వర్: ఈసారి శాసనసభ వర్షాకాల సమావేశాలు 7 రోజుల స్వల్ప నిడివితో ముగియనున్నాయి. తొలిరోజు సంతాపానికి పరిమితం కాగా మరోరోజు విరామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయంగా కీలకమైనవని విపక్షనేత నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తేందుకు ఉభయ విపక్షాలు సిద్ధం అయ్యాయి. ఈ సమావేశాల్లో రెండు ప్రతిపక్ష పార్టీలు బిజూ జనతా దళ్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై దాడికి సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజూ జనతా దళ్.. మహిళల భద్రత, ఎరువుల కొరత, లోపించిన శాంతిభద్రతలు ప్రధాన అంశాలుగా సభలో ప్రజల గొంతుకగా ప్రతిస్పందించాలని ఎమ్మెల్యేలకు అధినేత నవీన్ పట్నాయక్ సూచించారు. గత మూడున్నర నెలలుగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అసమర్థత, ఉదాసీనతతో కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు, మహిళలపై దారుణాలు ఆందోళనకరంగా పెరుగుతూ పౌరులలో అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, విద్యార్థి సంఘాల ఎన్నికలు, నిరుద్యోగం, శాంతిభద్రతలు వంటి ప్రధాన అంశాలతో ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని తీర్మానించింది. ఏడాదిన్నర కాలంగా పాలన సాగిస్తున్న మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడంలో విఫలమైందని పేర్కొంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. విపక్షాల దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికార పక్షం సభ్యులతో గురువారం సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని నిలదీసేందుకు..విపక్షాలు సిద్ధం