
అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత
భువనేశ్వర్: రాష్ట్ర 17వ శాసన సభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శాసన సభ వెలుపల, లోపల, పరిసరాల్లో ప్రతి కదలికపై నిఘా వేసేందుకు మూడంచెల భద్రతా వలయం సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్ధంగా ఎదుర్కోవడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించారు. శాసన సభ భద్రతా కార్యకలాపాల కోసం 30 ప్లాటూన్ల పోలీసులను మోహరించనున్నారు. 150 మంది ప్రత్యేక అధికారులు పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రాత్రింబవళ్లు 5 తాత్కాలిక కంట్రోల్ రూములు పని చేస్తాయి. స్ట్రైకింగ్ ఫోర్స్, బాంబు నిర్వీర్య బృందం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాయి. శాసన సభ సమీపంలోని వివిధ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దిగువ పీఎంజీలో 144 సెక్షన్ జారీ చేయనున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత