
అర్ధరాత్రి బాంబుల మోత
రాజధాని నగరంలో అలజడి
పౌరులకు తప్పిన ప్రాణహాని
దుండగుల కోసం పోలీసుల గాలింపు
భువనేశ్వర్: దేవీ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజధాని నగరంలో మంగళవారం అర్ధరాత్రి బాంబుల పేలుడు కలకలం రేపింది. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు భువనేశ్వర్ నగరం నడి బొడ్డున బాంబులు రువ్వి అలజడి రేపారు. పోలీసులకు బహిరంగ సవాలు విసిరారు. బొడొగొడొ, రాజధాని పోలీస్ ఠాణా ప్రాంతాల్లో భారీగా బాంబులు విసిరి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం తప్ప పౌరులకు ఎటువంటి ప్రాణహాని సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను జంట నగరాల కమిషనరేట్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని గాలింపు ముమ్మరం చేశారు. రెండు పోలీస్ ఠాణాల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేసి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
అప్రమత్తమైన పోలీసులు..
బొడొగొడొ పోలీస్ ఠాణా గౌతమ్ నగర్ బస్తీ, క్యాపిటల్ పోలీస్ ఠాణా ఫలికియా బస్తీపై భారీగా బాంబులు రువ్వారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆరుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చి ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. తొలుత గౌతమ్ నగర్ బస్తీపై 5 బాంబులు రువ్వారు. తరువాత వారు ఫలికియా బస్తీపై మూడు బాంబులు విసిరారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలం చేరే సమయానికి దుండగులు పరారయ్యారు. ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరు బాంబులు విసిరారో పోలీసులు స్పష్టం చేయలేదు. గత రెండు నెలల్లో భరత్‌పూర్ పండా కుడియా బస్తీ, పులీశ్వరి బస్తీలలో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. ఈ చర్యలు స్థానికుల్ని కలవరపరుస్తున్నాయి.
దుర్గా పూజలకు సిద్ధం..
రాష్ట్రంలో దుర్గా పూజోత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు బుధవారం డీఐజీ సెంట్రల్ రేంజ్ పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశయ్యారు. శాంతిభద్రతలను నిశితంగా పరిశీలించాలని ఎస్పీలకు ఆదేశించారు.

అర్ధరాత్రి బాంబుల మోత