
ఆయుష్మాన్‌భవ కార్డుదారులను.. దోచుకుంటున్న దళారీలు
జయపురం: కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు అందించే వైద్య సేవలు ఉచితంగా పొందేందుకు వృద్ధులు, ప్రజలకు ఆయుష్మాన్‌భవ కార్డులు సమకూర్చింది. ఈ కార్డుదారులపైన కొంతమంది దళారుల కన్ను పడింది. రోగులకు దగ్గరుండి వైద్యం చేయిస్తామని, అంబులెన్స్‌లు తీసుకువచ్చి పక్క రాష్ట్రానికి తీసుకువెళ్తున్నారు. అయితే వారికి ఎటువంటి వైద్యం చేయించకుండానే హాస్పిటల్ వర్గాలతో చేతులు కలిపి ఆయుస్మాన్‌భవ కార్డులలోని డబ్బులు కాజేస్తున్నారని జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంద్రా సమితి అసన గ్రామ పంచాయతీలో పకనగుడ గ్రామానికి ఛత్తీష్‌గఢ్ నుంచి శుక్రవారం రెండు అంబులెన్స్‌లు రోగులను తీసుకువెళ్లేందుకు వచ్చాయన్న అనుమానంతో గ్రామస్తులు వాటిని అడ్డగించి అందులో ఉన్న దళారీని పట్టుకున్నారు. ఈ విషయం కొట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బిప్రనారాయణ ఆచార్యకు తెలియజేయగా.. ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంద్ర పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ సనాతన శుశాణ, కానిస్టేబుల్ రవీంద్ర పూజారీ వచ్చి ఆ రెండు అంబులెన్స్‌లను, దళారిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గ్రామ వాసుల ఆరోపణ ప్రకారం కొద్దిరోజులుగా స్థానిక గురునాథ్ కమర సహకారంతో ఫూల్‌భట్ట గ్రామ పంచాయతీలో ఆయుష్మాన్‌భవ కార్డులున్న కొంత మంది వ్యక్తులను ఛత్తీష్‌గడ్‌లోని బస్తర జిల్లా జగదల్‌పూర్‌కు తీసుకువెళ్తున్నారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించిన సంఘటనపై ప్రజలకు అనుమానం వచ్చింది. ఒడిశాలో రోగులకు వైద్య చికిత్స కొరకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నా.. ఛత్తీష్‌గఢ్‌లో ఏ సౌకర్యాలు ఉన్నాయని తీసుకువెళ్తున్నారన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానంతోనే గ్రామస్తులు రెండు అంబులెన్స్‌లను అడ్డుకున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ఫూల్‌భట్ట గ్రామం నుంచి ఆయుశ్మాన్‌భవ కార్డులు గల దాదాపు 25 మంది రోగులను ఛత్తీష్‌గఢ్‌లో ఒక ప్రైవేట్ చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య చికిత్సలు చేయకుండా కేవలం భోజనం పెట్టి వారి ఆయుష్మాన్‌భవ కార్డులు అడిగి తీసుకొని వారి ఫోన్లకు వచ్చే ఓటీపీ అడుగుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. తద్వారా వారికి చికిత్సకు ఖర్చు అయినట్లు చూపించి ఆయుస్మాన్‌భవ కార్డులలో డబ్బులు తీసుకుంటున్నారన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణపై పూర్తి దర్యాప్తు జరిపిన తరువాత వాస్తవాలు బయట పడతాయని పోలీసు అధికారి అశ్వినీ పట్నాయక్ వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కొట్‌పాడ్ సమితి చందిలిలో గల చికిత్సాలయం పీఆర్‌ఓ కర్ణ భొత్రను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే కెరమటి గ్రామం దళాల్ నినిబాబు కుమార్ కూడా ఈ ప్రాంత రోగులను రాయపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తూ ఒక్కొక్క రోగి వద్ద వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడని ఆరోపణలున్నాయి. నినిబాబు రాయపూర్ తీసుకువెళ్లిన శ్రీధర పూజారి, ఖగునతి అనే వ్యక్తలకు కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని, వారికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. వారు చికిత్స చేయించుకోకుండా ఇళ్లకు తిరిగివచ్చారు. దళారులు పట్టుబడిన తరువాత అనేక విషయాలు బయటపడుతున్నాయని ప్రజలంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి అశ్వినీ పట్నాయక్ పత్రికల వారికి వెల్లడించారు.
చత్తీష్‌గఢ్‌కు రోగులు తరలింపు
వారి కార్డుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం
రంగంలోకి దిగిన పోసులు అధికారులు
పూర్తి స్థాయిలో విచారణ తరువాత వివరాలు వెల్లడి