
అరసవల్లిలో భానుసప్తమి సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భానుసప్తమి సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలను కిటకిటలాడాయి. ఆరోగ్య ప్రదాతకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతివ్వడంతో సజావుగా దర్శనాలు చేసుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయం బయట భక్తుల కోసం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో టెంట్లు వేసినప్పటికీ.. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఏర్పాట్లు సరిపడలేదనే విమర్శలు వినిపించాయి. కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకుని ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసుకుని దర్శనాలకు బారులు తీరారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కారాల పూజలను చేయించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ కలిగిన భక్తులకు మాత్రమే అనుమతించారు. పలువురు భక్తులు తమ పెద్దల పేరిట ఆలయ అభివృద్ధికి, అలాగే నిత్యాన్నదాన పథకానికి విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ నాయకురాలు జె.సుభద్ర కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను ఇచ్చారు. వేదాశీర్వచనాన్ని అర్చకులు అందజేసారు.
ఆదాయం రూ.6.24 లక్షలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి భానుసప్తమి సందర్భంగా ఒక్కరోజులో రూ.6,24,188 వరకు ఆదాయం లభించింది. దర్శనాలకు వివిధ రకాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3.18 లక్షలు, విరాళాల ద్వారా రూ.80,188, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.26 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈవో ప్రసాద్ వివరించారు.

అరసవల్లిలో భానుసప్తమి సందడి