
సమాచార హక్కు దుర్వినియోగం
● ఏడాది పాటు దరఖాస్తుల దాఖలు నిషేధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సమాచార కమిషన్ ఒక వ్యక్తిని ఒక సంవత్సరం పాటు సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తులు చేయకుండా నిషేధించింది. సతొపురి గ్రామానికి చెందిన చిత్తరంజన్ సెఠి అనే దరఖాస్తుదారుడు మెయితిపూర్ గ్రామ పంచాయతీ, నిమాపడా మండల కార్యాలయం నుంచి ఒకే అంశంపై సమాచారం కోరుతూ వరుసగా 61 సార్లు దరఖాస్తు చేశాడు. నెలవారీగా, సంవత్సరం వారీగా ఆదాయం, ఖర్చు మరియు అభివృద్ధి పనుల వివరాలను కోరుతూ ఈ దరఖాస్తులు దాఖలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర సమాచార కమిషనర్ సుశాంత కుమార్ మహంతి ఈ నిషేధ ఆదేశాలు జారీ చేశారు.
సమాచార హక్కు చట్టపరంగా దరఖాస్తుల పట్ల అనుబంధ వర్గాలు ప్రతిస్పందించడంతో సంబంధిత దస్తావేజులు, పత్రాలను ప్రత్యక్షంగా తనిఖీ చేయడానికి అవకాశాలు కల్పించినప్పటికీ చిత్తరంజన్ సెఠి పదే పదే దరఖాస్తులు దాఖలు చేయడం కొనసాగించారని సమాచార హక్కు విచారణ పీఠం పేర్కొంది. ఈ పరిశీలన ఆధారంగా అప్పీలుదారు, ఫిర్యాదుదారు దాఖలు చేసిన 61 కేసులను ఇందు మూలంగా కొట్టివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పైన పేర్కొన్న వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, దరఖాస్తుదారుడి ప్రవర్తన సమాచార హక్కు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని కమిషన్ తేల్చింది. అతని చర్య దుర్వినియోగానికి స్పష్టమైన సూచన. భారత పౌరుడిగా, దరఖాస్తుదారుడు సమాచార హక్కు చట్టం, 2005 కింద సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉన్నా ఎవరైన దేశ చట్టాన్ని, విధానాన్ని పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అంకితమైన ఏ సంస్థ కూడా అలాంటి పవిత్రమైన చట్టాన్ని అసమానంగా, ఇష్టానుసారం ఉపయోగించడాన్ని అంగీకరించదు. ప్రస్తుత సంఘటనలో దరఖాస్తుదారుడిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అర్హుడు అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
బీపీఎల్ కార్డును ఉపయోగించి దరఖాస్తుదారుడు విచక్షణారహితంగా దరఖాస్తు దాఖలు చేసినట్లు సమాచార హక్కు విచారణ బృందం ధృవీకరించింది. కలెక్టర్, పూరీ జిల్లా మేజిస్ట్రేట్ దరఖాస్తుదారుని బీపీఎల్ కార్డు వాస్తవికత, ప్రస్తుత స్థితిని ధృవీకరించి తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 7(9) ప్రకారం అతని నుండి పునరావృతం అయ్యే లేదా భారమైన ప్రశ్నలను తిరస్కరించాలని రాష ్‌ట్రవ్యాప్తంగా సంబంధిత శాఖలకు సలహా జారీ చేయాలని కమిషను పేర్కొంది.