
‘అపరాజిత–2025’ వెలువరించాలి
జయపురం: చరిత్రాత్మక జయపురం దసరా వేడుకుల సందర్భంగా దసరా సావనీర్ ‘అపరాజిత–2025’ వెలువరించాలని దసరా మహోత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ అధ్యక్షుడు, జయపుం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి నివాసంలో ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవ సావనీర్ ‘అపరాజిత–2025’ లో జయపురం చరిత్ర, ప్రాధాన్యత, గౌరవం, పరిశోధనలు, రచనలు పొందుపరచటం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అపరాజిత –2025 సావనీర్‌కు రచయిత, పరిశోధకులు డాక్టర్ పరేష్ రథ్ ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తారన్నారు. ఈయనతోపాటు సంపాదక కార్యవర్గంలో జయపురం సాహితీ పరిషత్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ దాస్, సభ్యులు నవకృష్ణ రథ్, జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్, రచయిత డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్, సాహితీవేత్త శ్రీనాథ్ మిశ్ర, కాంగ్రెస్ నేత నిహార రంజన్ బిశాయి ఉంటారని వెల్లడించారు. విజ్ఞానులు, రచయితలు, పరిశోధకులు, కవులు, చరిత్రకారులు, జయపురం, చరిత్ర, జయపురం దసరా ఉత్సవాల ప్రాధాన్యతపై వ్యాసాలు, రచనలు, పరిశోధన వివరాలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.