
స్కూల్లో గొడవ.. పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ!
● విద్యార్థి, కుటుంబ సభ్యులపై దాడి చేయించిన టీడీపీ నేత ● అధికార పార్టీ కావడంతో కేసు నమోదులో పోలీసుల తాత్సారం
శ్రీకాకుళం రూరల్ : పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలు టీడీపీకి చెందినవి కావడంతో రాజీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. చాపురం పంచాయతీకి చెందిన ఓ టీడీపీ సీనియర్ నాయకుడు.. రాగోలులో నివాసముంటున్న ఆమదాలవలసకు చెందిన మరో టీడీపీ నాయకురాలి పిల్లలు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఓ విషయమై ఇద్దరు పిల్లలు పాఠశాలలో గొడవపడ్డారు. ఈ విషయాన్ని చాపురంలో ఉంటున్న టీడీపీ నేతకు కుమారుడు చెప్పడంతో వారంతా వెళ్లి రాగోలులో నివాసముంటున్న టీడీపీ సభ్యురాలిపైన, ఆమె కుమారుడిపైన దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదు. తీవ్రంగా గాయపడిన మహిళ మాత్రం దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌లో తిష్టవేసింది. అయినప్పటికీ పోలీసులు రాజీచేసే దిశగా చేస్తున్నారే తప్ప కేసు నమోదు చేయడంలో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రాము వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు.