
కామర్స్ అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపక పోస్టును భర్తీ చేయడానికి గెస్ట్ లెక్చరర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ అర్హత కలిగి ఉండాలని, నెట్,సెట్, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల10న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా స్థాయి భజన పోటీలు రేపు
పాలకొండ: పట్టణంలోని ఏలాం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయ మంటపం వద్ద బుధవారం జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. పోటీలో గెలుపొందిన భజన బృందాలకు మొదటి బహుమతిగా రూ.6వేలు, రెండవ బహుమతి రూ.5వేలు, మూడవ బహుమతి రూ.4 వేలు అందిస్తామని వివరించారు. అలాగే బెస్ట్ సింగర్, బెస్ట్ డోలక్, బెస్ట్ హర్మోనిస్టులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న భజన బృందాలు నేరుగా తమ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు.
నలుగురు జూదరుల అరెస్టు
లక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై ఎస్సై నవీన్‌పడాల్ నేతృత్వంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,860 నగదు, రెండు జతల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం
● 24కేజీల గంజాయితో ఏడుగురి అరెస్ట్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో సోమవారం ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన ముఠానుంచి ఓ ప్రైవేట్ లాడ్జిలో 24కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. ఒడిశాకు చెందిన రామ్‌ఖిల, రమేష్ కోరా, సంతోష్, ప్రశాంత్‌లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్, వినయ్, ప్రతాప్‌లకు లాడ్జి వద్ద గంజాయిని అందజేస్తున్న క్రమంలో ఒక సూట్‌కేస్, మరో బ్యాగ్‌లో అప్పజెప్పేందుకు ఉంచిన గంజాయితో పాటు వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులతో పాటు వారు ఉపయోగించిన కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
వట్టి గెడ్డలో రైతు గల్లంతు?
సాలూరు రూరల్: మండలంలోని దుద్దిసాగరం గ్రామానికి చెందిన మంచాల రామయ్య (45) సోమవారం వట్టి గెడ్డలో గల్లంతయ్యాడు. వట్టిగెడ్డ దాటి ఉన్న తన పొలం పనులకు రామయ్య సోమవారం ఉదయం వెళ్లి తిరిగి సాయంత్రం 5.30గంటల సమయంలో వస్తుండగా వట్టి గెడ్డలో దిగి వస్తుండగా గల్లంతయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే వట్టిగెడ్డ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు.
విజయనగరం టౌన్: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 161వ జయంత్యుత్సవం ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్‌లో సోమవారం వైభవంగా నిర్వహించారు. శ్రీ అన్నమాచార్య కళాపీఠం పొద్దుటూరుకి చెందిన హరికథా భాగవతులు యడ్లవల్లి రమణయ్య భాగవతార్‌కు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా హరికథా చూడామణి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ కళలకు కాణాచిగా ప్రసిద్ధికెక్కిన విద్యలనగరంలో సాహితీ సంస్థల కృషి ఎనలేనిదన్నారు. పురస్కార గ్రహీత యడ్లవల్లి మాట్లాడుతూ విజయనగరంలో పురస్కారం పొందడం తన పూర్వజన్మసుకృతమన్నారు. అనంతరం యడ్లవల్లి చేసిన భక్త మార్కండేయ కథాగానం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముందు హరికథా చూడామణి కాళ్ల నిర్మల భాగవతారిణి నిర్వహించిన సుందరకాండ హరికథ ఆహుతుల కరతాళధ్వనులందుకుంది. సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సవ సంఘ అధ్యక్షుడు పి.వి.నరసింహరాజు (బుచ్చిబాబు), సభాధ్యక్షుడు ఎ.రంగారావు దొర, ప్రతినిధులు సోమయాజులు, వై.బాబూరావు, ఎం.సుధాకర్, కోలపల్లి ధర్మ శ్రీరామబాబా, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కామర్స్ అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం