
చెరువులో మునిగి ఒకరు మృతి
జయపురం: ఒక వ్యక్తి దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దశమంతపూర్ పంచాయతీ పండ్రిపొడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో గ్రామస్తులు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వారితో పాటు గుప్త నాయిక్(35) కూడా వెళ్లాడు. దహన సంస్కారాలు అనంతరం గుప్త నాయిక్ ఇంటికి బయల్దేరాడు. అయితే అతడు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పరిసర ప్రాంతాల్లో వెదికింది. గ్రామ సమీపంలోని ఒక చెరువు వద్ద తన కుమారుడి చెప్పులు కనిపించాయి. అనుమానంతో ఆమె గ్రామ ప్రజలకు తెలిపింది. గ్రామ ప్రజలు చెరువులో ఎంత గాలించినా జాడ తెలియలేదు. దీంతో బొయిపరిగుడ అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో మృతదేహాన్ని బయటకు తీశారు. బొయిపరిగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గుప్త నాయిక్ చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.